'గీత'కు అందలం? హైదరాబాద్ : భవిష్యత్తు రాజకీయాలలో తనకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి రోశయ్య వ్యూహాత్మక ఎత్తుగడలకు శ్రీకారం చుడుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో తెలంగాణ వివాదాన్ని సద్దుమణిగేలా చూడటానికి, తన అస్మదీయులకు పదవులు కట్టబెట్టటానికి మంత్రివర్గ విస్తరణ ఆయుధానికి పదును పెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలు జరగడానికి ముందు ముఖ్యమంత్రి రోశయ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా తెలంగాణకు చెందిన మంత్రి జె. గీతారెడ్డిని నియామకం చేయడంతో పాటుగా, మంత్రివర్గాన్ని విస్తరించి పదవుల పందేరం సాగించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య ఇటీవలే పాలనా పరంగా తన టీమ్ ను సిద్ధం చేసుకున్నారు. మరింత సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు పాలనా వ్యవస్దను అతలాకుతలం చేస్తున్న తెలంగాణ వాదం ఈ నెలాఖరు నాటికి సమసిపోతుందని ఆయన భావిస్తున్నారు. అదిష్టానం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణ వాదానికి కాస్త విరామం లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊరటగా అధిష్టానం ఉప ముఖ్యమంత్రి పదవిని ఖరారుచేసి ఈ మేరకు సీఎంకు సంకేతాలు పంపినట్లు సమాచారం. అధిష్ఠానం చేసిన ఈ సూచనను అమలు చేసేందుకు సీఎం కసరత్తు చూసి వ్యూహాన్ని రూపొందించారు.
ఇపుడున్న తెలంగాణ ఉద్యమ హోరు నెలాఖరు నాటికి సద్దుమణగగానే ఆయన తన రాజకీయ చతురత ప్రదర్శనకు ముహూర్తం పెడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి జె. గీతారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియామకం చేసేందుకు సీఎం రంగం సిద్థం చేసినట్లు విశ్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే తన వద్ద ఉన్న కీలకమైన ఆర్థిక, విద్యుత్, ఎక్సైజ్, స్త్రీ, శిశుసంక్షేమ శాఖలకు కొత్త మంత్రులను నియమించాలని రోశయ్య యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఆర్ధిక మంత్రిగా నియమించాలని ఆయన ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎంగా గీతారెడ్డిని ఎంపిక చేయడం వెనుక సీఎం వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు వెల్లడవుతోంది.
1956లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంలో తెలంగాణను నిర్లక్ష్యం చేయకుండా పెద్దమనుషులు చేసిన ఒప్పందాన్ని తెర మీదకు తెచ్చి డిప్యూటీ సీఎం పీఠం గీతారెడ్డికి కట్టబెట్టాలని రోశయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గీతారెడ్డి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తే రెడ్డి కులానికి చెందిన మరో నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పరిస్థితి సద్దుమణిగితే బడ్జెట్ సమావేశాలకు ముందు, లేకుంటే ఆ తరువాత ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసే అవకాశాలున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం తరువాత అధినేత్రి సోనియాను కలిసి గీతారెడ్డికి డిప్యూటీ సీఎం, మంత్రివర్గ విస్తరణ జాబితాలకు ఆమోదముద్ర వేయించుకోవాలని రోశయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News Posted: 18 January, 2010
|