'టోలు' ఇంకా వలుస్తారు! న్యూఢిల్లీ : దేశంలో రహదారులను నిర్మించి నిర్వహిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్లకు టోలు చార్జీలు వసూలు చేసుకునే హక్కుల గడువును పెంచాలని కేంద్ర రాహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ గడువు 15 నుంతి 20 సంవత్సరాలుగా ఉంది. దీనిని మరింత పెంచడం ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లు అదనపు పెట్టుబడులను సమీకరించుకోవడం ద్వారా విస్తరణ పనులు చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కొన్నిసార్లు రహదారులను అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేయవలసి రావడం, రహదారిపై భద్రతకు అదనపు చర్యలు తీసుకోవడం రోడ్ల నిర్వాహణ చేపట్టిన కాంట్రాక్టర్ కు భారంగా మారుతోందని మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. టోలు వసూలు చేసుకునే హక్కు గడువును పెంచడానికి అవసరమైన మార్పులను మోడల్ కన్సెషన్ ఎగ్రిమెంట్(ఎంసిఎ)లో చేయాల్సి ఉందని వారు తెలిపారు. ఈ ఎగ్రిమెంట్ లో గడువు పెంచే నిబంధనను కూడా చేర్చాలనుకుంటున్నామన్నారు. రహదారి నిర్మాణానికి, నిర్వహాణకు అయ్యే ఖర్చు, దానిని రాబట్టడానికి పట్టే సమయాన్ని పరిశీలించి గడువును ఎంత పెంచాలన్నది నిర్ణయిస్తామని రహదారుల శాఖ కార్యదర్శి బ్రహ్మ దత్ వివరించారు.
ఈ చర్య వలన ప్రస్తుతం కాంట్రాక్టర్లకు, భారత జాతీయ రహదారుల సంస్థ(నెహాయ్) అధికారులకు మధ్య ఏర్పడుతున్న వివాదాలు కూడా పరిష్కారం కాగలవని ఆయన చెప్పారు. రహదారి మంత్రిత్వశాఖలోని ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉందని ఆయన తెలిపారు. రహదారుల నిర్మాణంలో మెగా ప్రాజెక్టులకు సంబంధించినంత వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక నియమాలు, నిబంధనలు, ప్రతిపాదనలు చాలా కఠినంగా ఉంటాయని, అందువలన భారతదేశానికి చెందిన కాంట్రాక్టర్లు ఎక్కువగా అర్హత సాధించేలా చూడటానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. మెగా ప్రాజెక్టులను చేపట్టే సామర్ధ్యం ఉన్న కంపెనీలు దేశంలో కేవలం 20 మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. అవి కూడా వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులను చేపట్టగలవని అన్నారు. రహదారులకు సంబంధించి తాము చేపట్టబోయే మెగా ప్రాజెక్టులకు కనీసం అయిదారుగురునైనా అర్హత సాధించేలా చూడాల్సి ఉందని ఆయన చెప్పారు.
నెహాయ్ ప్రస్తుతం రాజస్తాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరు వరసల రహదారులను, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో నాలుగు వరసల రహదారులను, పంజాబ్, రాజస్థాన్ లో రెండు వరసల రహదారులను నిర్మించే పది మెగా ప్రాజెక్టులను సిద్ధం చేసిందని దత్ వెల్లడించారు. అలానే గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా రహదారుల నిర్మాణానికి సంబంధించి మెగా ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం నాలుగో దశగా విస్తరణ కోసం దాదాపు 20 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నామని చెప్పారు. వచ్చే డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టులు మొదలు అవుతాయని వివరించారు.
News Posted: 19 January, 2010
|