ఇది బంద్ యుగం హైదరాబాద్ : అతి కొద్ది సమయంలో అత్యధిక బంద్ లకు రాష్ట్రం వేదికగా నిలిచి సరికొత్త రికార్డ్ ను సాధించింది. కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో 11 రోజులు పాటు బంద్ పాటించడంతో ఆంధ్రప్రదేశ్ ఈ రికార్డ్ ను నెలకొల్పగలిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా ఈ బంద్ లకు కొదవ లేకుండా పోయింది. 11 రోజుల బంద్ లో కోన్ని ప్రత్యేక తెలంగాణా వాదులు చేపట్టగా, మరికొన్నింటిని సమాక్యాంధ్ర వాదులు నిర్వహించినవి. ఈ బంద్ లలో ఎనిమిది రోజుల తెలంగాణ వాదులు చేపట్టినవి కాగా, మిగిలిన మూడు సమైక్యవాదులు చెపట్టినవి.
తొలుత తెలంగాణ ప్రాంతంలో ఈ బంద్ పర్వం ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఆమరణ నిరహార దీక్షకు దిగినప్పుడు పోలీసులు ఆయన్ను అడ్డకొని ఖమ్మం ఆసుపత్రికి తరలించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు అదే రోజున నవంబర్ 29 న బంద్ కు పిలుపునిచ్చాయి. ఆ తరువాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 6, 7 తేదీల్లో తెరాస శ్రేణులు మళ్లీ బంద్ చేసారు. ఈ సమయంలో ప్రత్యేక తెలంగాణ వాదం ఉధృతంగా సాగుతున్నందున ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా సమైక్యాంధ్ర పేరిట ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో రాష్ట్ర విభజన చేయరాదంటూ సమైక్యాంధ్ర వాదులు సీమాంధ్ర ప్రాంతాల్లో డిసెంబర్11, 12 తేదీల్లో పిలుపునిచ్చారు.
ఆ తరువాత రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్ 19న మళ్లీ సీమాంధ్ర ప్రాంతాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు కేంద్ర వైఖిరిని నిరసిస్తూ తెలంగాణ ప్రాంతంలో మళ్లీ డిసెంబర్ 23,24 తేదీల్లో కొత్తగా ఏర్పడిన జేఏసీలు బంద్ చేసి జనజీవనాన్ని స్తంభింపచేసాయి. ఈ బంద్ జరిగిన వారం రోజుల తరువాత మళ్లీ తెలంగాణలోనే బంద్ జరిపారు. ప్రత్యేక తెలంగాణ తప్పితే కేంద్ర ప్రభుత్వం మరే ఇతర నిర్ణయం తీసుకున్నా సహించేది లేదంటూ డిసెంబర్ 30న తెలంగాణ ప్రాంతాల్లో బంద్ చేసారు. ఆ తరువాత తెలంగాణ వాదాన్ని అణగదొక్కితే సహించమంటూ, ఢిల్లీలో అఖిలపక్ష సమావేసం జరగడానికి ముందు తెలంగాణలో జనవరి 4న బంద్ జరిపారు. దీంతో తెలంగాణలో బంద్ ల స్కోరు10 కి చేరింది. ఇపుడు తాజాగా జనవరి 20న తెలంగాణ వాదులు బంద్ నిర్వహిస్తుండటంతో వాటి స్కోరు 11కి చేరి రికార్డ్ దిశగా బాటలు వేసింది.
ఇలా సమైక్యవాదులు, తెలంగాణ వాదులు, రాజకీయ పార్టీలు, జేఏసీలు ఇష్టానుసారం బంద్ లు చేపట్టడంపై తీవ్ర అసహనానికి గురైన నెల్లూరు నివాసి హై కోర్టులో కేసు వేసాడు. ఈ పిటీషన్ పై స్పందించిన హై కోర్టు బంద్ లు చేపట్టిన రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.ఈ బంద్ కారణంగా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రోశయ్య ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News Posted: 20 January, 2010
|