ఈసీ వజ్రోత్సవాలు న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం వజ్రోత్సవాలు జరుపుకునేందుకు ముస్తాబవుతోంది. ఎన్నికల సంఘం ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఉత్సవాలు చేపడుతున్నారు. ఈ 60 ఏళ్ల కాలంలో అత్యంత విజయవంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించినందుకుగాను ఎన్నికల సంఘం ఈ ఉత్సవాలు జరుపుకునేందుకు సంబరపడుతోంది.
అంతేగాక ఎన్నికల నిర్వహణలో సాధించిన విజయాలను, అనుభావాలను పరస్పరం పంచుకుందామంటూ పొరుగు దేశాల నుండి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పాక్ దేశం నుండి కూడా భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ విజయాలను తెలుసుకునేందుకు ద్వైపాక్షిక చర్చలు సాగిద్దామంటూ వినతి అందింది.దీంతో ఈ మేరకు పాకిస్తాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జస్టిస్ హమీద్ ఆలీ మిర్జా కు కూడా డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గేనందుకు , ద్వైపాక్షిక చర్చలకు రావాలంటూ అధికారులు ఆహ్వానం పంపారు.
అలాగే చాలా దేశాలకు చెందిన ఎన్నికల సంఘాలకు ఈ ఉత్సవాల్లో పాల్గోవాలంటూ ఆహ్వానం పంపామని భారత ఎన్నికల సంఘ డైరక్టర్ జనరల్ (ఇన్పర్మేషన్) అక్షయ్ రౌత్ చెప్పారు. జనవరి 25న న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆయన వివరించారు. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలకు చెందిన ఎన్నికల సంఘ ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని, వారితో పాటుగా కామన్వెల్త్ దేశాల, సార్క్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు.
ఉత్సవాల్లో రాష్ట్రపతి డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారక ప్రత్యేక స్టాంప్ ను ఆవిష్కరించనున్నారని ఆక్షయ్ తెలిపారు. అలాగే 250 పేజీలతో రూపొందించిన 'రీన్ ఫోర్సింగ్ ఇండియా డెమొక్రసీ- లోక్ సభ ఎలక్షన్స్ -2009 పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి అన్సారీ ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు.
News Posted: 20 January, 2010
|