పంటితో కంటిచూపు హైదరాబాద్ : పన్ను దేనికి పనికొస్తొంది..? అని అడిగితే చికెన్ తినడానికి, కాస్త అందంగా ఉంటే నవ్వడానికి అనే సమాధానాలు ఠక్కున వస్తాయి. అంతకుమించి పన్నుల తో ప్రయెజనం ఏమి ఉంటుందని ఎవరూ అంతగా లెక్క చేయరు. అలాగే ఎవరికైనా పన్ను ఊడితే చెత్త బుట్టలో పడేస్తారు. కానీ ఇకపై పన్నుకు పెరిగే విలువ తెలిస్తే బంగారంలా దాచేయడం ఖాయం.ఎందుకంటే పన్నుతో అద్భుతాలు సృష్టించే రోజులు వచ్చేసాయి. పన్ను ఇకపై కన్నులా కూడా పని చేయనుంది. పన్నులో కన్నును అమర్చే వైద్య పరిజ్జ్ఞానం అందుబాటులోకి వచ్చింది.ఆస్టియో-అడంటో కెరటోప్రోస్థైసిస్ (ఒఒకెపి) పేరిట పన్నుతో కంటి చూపు వచ్చే నూతన పద్దతి వైద్య విధానాన్ని కనుగొన్నారు. పన్నుకు కొంచెం రంధ్రం చేసి దానిలో టెలీస్కోపిక్ లెన్స్ ను అమర్చడం ద్వరా కంటి చూపును పొందడం ఈ వైద్య విధాన ప్రత్యేకత. అయితే పన్ను మాత్రం ఇతరులది వాడటం కంటే ఎవరిది వారికే వాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
దీనిని నగరంలోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఈ నూతన పద్ధతి ద్వారా వైద్యం చేస్తున్నారు. సహజంగా వైద్యులు అంధత్వాన్ని తొలగించేందుకు కార్నియల్ ఇంప్లాంట్ పద్ధతిలో శస్త్ర చికిత్స చేస్తారు.అయితే సాధారణంగా 10 శాతం మందికి ఈ వైద్యం ద్వారా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు.అలాగే రసాయనాల, అగ్ని ప్రమాదాల కారణంగా కంటి చూపు కొల్పోయిన వారు కూడా కంటి చూపు రావడం కష్టం. అయితే ఈ ఒఒకెపి చికిత్స విధానంతో దృష్టిని పొందవచ్చునని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డైరక్టర్ డాక్టర్ జి ఎన్ రావు, డాక్టర్ వీరన్ సంగ్వన్ లు తెలిపారు. టెలీస్కోపిక్ లెన్స్ అమర్చిన పన్నును కన్ను స్థానంలో అమర్చుతారు.
News Posted: 20 January, 2010
|