ముస్లీం రక్షణలో శివుడు శ్రీనగర్ : గత రెండు దశాబ్దాల కాలంగా మూతపడిన శివాలయానికి మళ్లీ మహర్ధశ ఘడియలు వచ్చేశాయి. మిలిటెంట్ల దాడులను తట్టుకోలేక ప్రజలంతా వలస వెళ్లడంతో నిరాదరణకు గురైన ఈ ఆలయానికి ముస్లిం సోదరులు దీపధూపనైవేద్యాలతో ప్రాణం పోసారు. గతంలో వలస వెళ్లిన కాశ్మీరు పండిట్లు కూడా తిరిగి రావడంతో బుధవారం వసంత పంచమి సందర్బంగా భైరవాలయానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇపుడు భక్తులు తాకిడితో ఆలయం నిత్యం కళకళలాడుతోంది. దీంతో రెండు దశాబ్దాల కాలంగా నిరాదరణకు గురైన ఆలయం తిరిగి గత వైభవాన్ని సంతరించుకుంది.
కాశ్మీరు లోయ ప్రాంతంలో శ్రీనగర్ పూర్వపు పట్టణంలోని శీతల్ నగరంలో శీతలేశ్వర్ భైరవాలయం ఉంది. ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉండటంతో అక్కడి భక్తులు నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించేవారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేది. కాశ్మీరు పండితులు ధర్మకర్తలుగా వ్యవహరించి ఆలయ పాలనా వ్యవహారాలు జరిపేవారు. అయితే గత రెండు దశాబ్ధాలుగా ఈ భైరావాలయం ఉన్న ప్రాంతంలో తీవ్రవాదం హెచ్చుమీరిపోయింది. నిత్యం మిలిటెంట్ల దాడులు, తుపాకుల తో హోరెత్తిపోయేది. దీంతో భయకంపితులైన కాశ్మీరు పండిట్ లు ఆ లోయను వదిలి ఇతర సురక్షిత ప్రాంతాలు వలస వెళ్లారు. దీంతో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆ ఆలయం మూతపడింది.
అయితే ఆ సమయంలో అక్కడ సమీపంలోనే ఉంటున్న ముస్లీం లు కొందరు ఆలయం నిరాదరణకు గురి కావడాన్ని తట్టకోలేక వారే స్వయంగా పూజలు చేసే వారు. ముఖ్యంగా గులామ్ మహమ్మద్ ఈ భైరవాలయానికి నిత్యం దీపధూపాలతే నైవేద్యం చేస్తూ ఆలయాన్ని పరిరక్షించాడు. హిందు, ముస్లీంల మధ్య మతకల్లోలాలతో రగిలిపోయే కాశ్మీరులో ఒక ముస్లీం వ్యక్తి హిందూ దేవాలయానికి పూజలు చేయడం యావత్తూ దేశానికి ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశం ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు కాశ్మీరు ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించి ఆలయాభివృద్ధకి చర్యలు తీసుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ లోయలో మిలటెంట్ల కదలికలు, దాడులు తగ్గుముఖం కావడంతో వలస వెళ్లిన కాశ్మీరు పండిట్ లు కూడా తమ ప్రాంతానికి తిరిగి వచ్చారు. అప్పుడు వదిలిన అలయానికి మళ్లీ పూర్వ వైభవం కల్పించాలని కాశ్మీరి పండిట్ల సంఘర్షణ సమితి నిర్ణయించింది.
News Posted: 21 January, 2010
|