బుల్లెట్లే లేవు ముంబయి : తీవ్రవాదులు విరుచుకు పడతారా? అయితే ముంబయి పోలీసులు తెల్ల మొహాలు వేసి చూడాల్సిందే. ఎందుకంటే వారి వద్ద ఉన్న కాలం చెల్లిన తుపాకులకు సైతం తూటాలు లేవు మరి. ముంబయి పోలీసు వ్యవస్థలోని లొసుగులను 26/11 దాడులు తేటతెల్లం చేసి ప్రపంచానికి చాటి చెప్పాయి. తీవ్రవాదులను ఎదుర్కోడానికి ముంబయి పోలీసులకు ఎలాంటి శిక్షణ లేదని, వారి దగ్గర సరైన ఆయుధాలు, పరికరాలు, కనీసం సమన్వయం కూడా లేదని అప్పుడే తెలిసింది. ఆ దారుణ మారణ హోమం జరిగి సంవత్సరం గడిచినా ముంబయి పోలీసు వ్యవస్థలో మార్పులేమీ రాలేదు. కనీసం తుపాకీ కాల్చడం ప్రాక్టీసు చేయడానికి కూడా వారి దగ్గర బుల్లెట్లు లేవని తెలిసింది.
చక్కని శిక్షణ ఇస్తామని, ఆధునిక ఆయుధాలు, పరికరాలు ఇస్తామని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, పాలకులు ఊదరగొట్టే హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ పోలీసులకు ఏమీ అందలేదు. కాకపోతే కొంతలో కొంత నయం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఒక్కో పోలీసుకు 12 బుల్లెట్లు శిక్షణలో ఇచ్చారు. ఈ 12 బుల్లెట్లతోనే వారు లక్ష్యాన్ని కచ్చితంగా కొట్టగల నైపుణ్యం సాధించుకోవాలన్నమాట. అసలు బుల్లెట్లు వంటి మందుగుండు లేకపోవడం వలన ముంబయి పోలీసులు 2007 నుంచి ప్రాక్టీసు కూడా చేయలేదని రాం ప్రధాన్ కమిటీ చెప్పింది. ముంబయి పోలీసులు ఆయుధాల కొరతతో అగచాట్లు పడుతున్నారని ఆ కమిటీ పేర్కొంది.
సీనియర్ అధికారులు ఈ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మాజీ ఐపిఎస్ అధికారి వైపి సింగ్ వివరించారు. ఇప్పటికీ ముంబయి పోలీసులు గుణపాఠాలు నేర్చుకోలేదు.
ఇదిలా ఉండగా దేశంలో తీవ్రవాద దాడులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి ఎకె ఆంటోని హెచ్చరించారు. ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా దేశంలో చొరబడటానికి తీవ్రవాదులు అనేకసార్లు విఫలయత్నాలు చేసారని ఆయన వివరించారు. జమ్ము-కాశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయని, దానిని సహించలేని తీవ్రవాదులు దేశంలో దాడులు చేయడానికి సన్నద్ధమవుతున్నారని ఆయన తెలిపారు.
News Posted: 23 January, 2010
|