అంతిమయాత్రకూ రిజర్వేషన్ తిరువనంతపురం : బొందితో కైలాసం మాటేమోగాని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడానికి చాలా ముందే అంతిమయాత్రకు రిజర్వేషన్ చేయించుకోవచ్చు. అచ్చు మన ఏదైనా ఊరుకో, దేశానికో, పోనీ సినిమాకో వెళ్లడానికి రైలు లేదా విమానాలకు, థియేటర్ కో అడ్వాన్సుగా బుకింగ్ చేయించుకుంటాం కదా... ఆ మాదిరిగానన్నమాట. దేవుని సొంత దేశంగా పర్యాటక శాఖ ప్రచారం చేసే ప్రకృతి అందాలకు ఆలవాలమైన కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ లో ఈ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. చచ్చిపోయిన తరువాత వారస ప్రబుద్ధులు అంత్యక్రియలను సక్రమంగా ఆచారం ప్రకారం చేస్తారో? లేదో? అనుకునే సంశయ జీవులకు ఇదో వరం లాంటిది. పాలక్కడ్ లో ఉన్న 'అయివార్ మథం ట్రస్ట్' లో అంతిమయాత్రకు అడ్వాన్స్ బుకింగ్ చేయించుకుంటే ఆ తరువాత తీరిగ్గా, నిశ్చింతగా, ప్రశాంతంగా బకెట్ తన్నేయవచ్చు.
వైకుంఠయాత్ర అడ్వాన్స్ బుకింగ్ చేయించుకునే వారు రిజిస్ట్రేషన్ రుసుం కింద నాలుగు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతే మరెప్పుడూ ఎలాంటి నగదు ఖర్చు పెట్టనక్కర్లేదు. కాకపోతే ఎవరి పేరున రిజర్వేషన్ చేయించుకుంటారో వారే స్వయంగా ట్రస్ట్ కార్యాలయానికి వెళ్ళాల్సిందే. అలానే పాస్ పోర్టు సైజు ఫోటోలు, వ్యక్తి గుర్తింపును ధృవపరిచే అన్ని పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తీరా అవసరమైనప్పుడు అనవసర గందరగోళం జరగకుండా ఉండటానికని చెబుతున్నారు. ఈ అంతిమయాత్ర ప్యాకేజీలో అంబులెన్స్ సర్పీసు, అవసరమైతే మొబైల్ మర్చురీ, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించడానికి పూజారి, పవిత్రమైన, సంప్రదాయ కర్మకాండ, భరతప్పుజ నదీ తీరంలో ఉత్తర క్రియలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఒక కార్డు ఇస్తారు.
మహాభారతం లోనే 'మథాం' గురించి వివరణ ఉందని ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. కురుక్షేత్ర యుద్ధంలో హతులైన బంధువులందరికీ పాండవులే శ్రీకృష్ణుని సలహా మేరకు అంత్యక్రియలు నిర్వహించారని వారు వివరించారు. చాలామంది అనేక సంవత్సరాలుగా ఈ అంతిమయాత్ర బాధను తమవద్ద వినిపించేవారని, వారిని తాము చాలా వారించే వారమని, కాని చివరకు ట్రస్ట్ ఏర్పాటు ద్వారా ఈ మహాకార్యాన్ని చేపట్టామని ట్రస్ట్ కార్యదర్శి రమేష్ కొరప్పత్ తెలిపారు. ఈ ట్రస్ట్ నిధులతో అంత్యక్రియల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
News Posted: 26 January, 2010
|