వివాదాల 'పద్మ' న్యూఢిల్లీ : వివిధ రంగాలలో ప్రముఖులను 'పద్మ' అవార్డులతో సత్కరిస్తుండే కేంద్ర ప్రభుత్వం సంవత్సరం కూడా ఆనవాయితీగా 'పద్మ' అవార్డులను ప్రకటించింది. అయితే, రివాజుగానే వివాదాలు కూడా చోటు చేసుకోసాగాయి. ప్రముఖ హిందీ కవి ఒకరు తనకు ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించగా 'పద్మభూషణ్' అవార్డు విజేతలలో ఒకరిపై వివాదం తలెత్తింది.
సుప్రసిద్ధ హిందీ కవి జానకీ వల్లభ్ శాస్త్రి ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. ఇది తనను అవమానించడమే అవుతుందని, ఈ లేటు వయస్సులో ఇది తనను గౌరవించడం కాదని ఆయన పేర్కొన్నారు. 80వ దశకం ద్వితీయార్ధంలో ఉన్న జానకీ వల్లభ్ శాస్త్రి హిందీ సాహిత్యానికి విశిష్ట సేవ చేసినందుకు తనను అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆగ్రహాన్ని, అసంతుష్టిని వ్యక్తం చేస్తున్నారు.బీహార్ ముజఫర్ పూర్ లో నివసించే శాస్త్రి తాను 1995లోనే ఈ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. '(ప్రముఖ హిందీ కవులు) రామధారి సింగ్ దిన్కర్, బేణిపురిలకు పద్మశ్రీ రావడానికి నా ప్రేరణే కారణం' అని ఆయన తెలిపారు. 'ఈ వయస్సులో నన్ను ఎంపిక చేయడం హాస్యాస్పదం. ఇది నాకు అవమానమే' అని శాస్త్రి పేర్కొన్నారు.
శాస్త్రి ప్రముఖ హిందీ కవి, రచయిత, విమర్శకుడు. ఆయన ఎన్నో ప్రసిద్ధ కథలు, నవలలు, నాటికలు, జీవితచరిత్ర, వ్యాసాలు, గజల్స్, గీతాలు రచించారు. ఆయనను లోగడ రాజేంద్ర శిఖర్ సమ్మాన్, భారత భారతి అవార్డు, శివపూజన్ సహాయ్ అవార్డు వంటి అవార్డులతో సత్కరించారు.
ఇది ఇలా ఉండగా, 'పద్మ' అవార్డు విజేతల జాబితాలో సంత్ సింగ్ చత్వాల్ పేరు చేర్చడం వివాదాస్పదమైంది. ఇండియాలో బ్యాంకు కుంభకోణానికి కోర్టు విచారణలను ఎదుర్కొన్న, అమెరికాకు చెందిన హోటలియర్ సంత్ సింగ్ చత్వాల్ కు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఇది వెంటనే వివాదానికి దారి తీసింది. ఈ అవార్డును ఉపసంహరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లోక్ సభలోని ఉప ప్రతిపక్ష నాయకుడు గోపీనాథ్ ముండే ప్రధానికి ఒక లేఖ రాశారు. చత్వాల్ కోసం ఒకప్పుడు సిబిఐ అన్వేషించినట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) నుంచి తీసుకున్న రుణాన్ని చత్వాల్ ఎగవేసినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత ముండే తన లేఖలో తెలియజేశారు.
కాగా, బిల్ క్లింటన్ కోసం కూడా ఎన్నికల నిధులు వసూలు చేసిన చత్వాల్ పేరును తొలుత అవార్డు కమిటీ సిఫార్సు చేయలేదని తెలుస్తున్నది. ఉన్నత స్థాయిలో ఎవరి జోక్యంతోనో ఆయన ఈ జాబితాలో చోటు చేసుకుని ఉండవచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, అవార్డు కమిటీ చత్వాల్ పేరును సిఫార్సు చేసిందా లేదా అనేది చెప్పడానికి హోమ్ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు నిరాకరించారు.
News Posted: 26 January, 2010
|