రాహుల్ కి గేట్స్ ప్రశంస న్యూఢిల్లీ : భారత యువ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీపై అమెరికా మిలియనీర్, సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ 'చాలా నిక్కచ్చైన వ్యక్తి'గా అభివర్ణించారు. దేశంలోని వైద్య సదుపాయాలపై రాహుల్ తనతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని వివరించారు. ప్రపంచంలో వైద్య సౌకర్యాలకు ముఖ్యంగా ఎయిడ్స్ నిరోధానికి కృషి చేస్తున్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ అయిన బిల్ గేట్స్ తన వార్షిక నివేదకలో ఈ వ్యాఖ్యానాలు చేశారు. గత యేడాది తాను చేసిన భారత్ సందర్శన అనుభవాలను ఈ నివేదికలో బిల్ గేట్స్ పొందుపరిచారు.
ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య స్థితి చాలా ఘోరంగా ఉందని, కాని ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో వైద్యానికి కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చు చేయాలన్న ఆకాంక్ష ఉన్న నవతరం నాయకుడు రాహుల్ గాంధీ అని గేట్స్ పేర్కొన్నారు. 'రాహుల్ చాలా ముక్కుసూటి మనిషి. వైద్యానికి కేటాయిస్తున్న సొమ్ములు ఎవరికి చేరాలో వారికి చేరడం లేదని, దానిని సరైన దారిలో పెట్టడం అంత సులభం కాదని నాతో అన్నారు' అని గేట్స్ వివరించారు. ఆయన బోళాతనం స్ఫూర్తిదాయకమైందని, నిధులు ఇచ్చే దాతలతో ఏ రాజకీయ నాయకుడు అంత సూటిగా మాట్లాడరని గేట్స్ అభిప్రాయపడ్డారు.
News Posted: 26 January, 2010
|