'భారత్ ఆగడం లేదు' వాషింగ్టన్ : అమెరికా ఏ విషయంలోనూ రెండవ స్థానంలో ఉండటాన్ని తాను అంగీకరించబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. 'మన వృద్ధికి అడ్డుగా ఉన్న సమస్యలను' పరిష్కరించాలని, అలా జరగని పక్షంలో ఇండియా, చైనా, జర్మనీ దేశాలు అమెరికాను వెనక్కి నెట్టి ముందుకు పోగలవని ఒబామా అన్నారు. 'నేను పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మన విస్తృత సమస్యల పరిష్కారానికి పూనుకోన్నానని, కాని అది మరీ అత్యాశతో కూడుకున్నదని, అటువంటి యత్నాలు మరింత వివాదాస్పదమైనవని, మన రాజకీయ వ్యవస్థ స్తంభించిపోయిందని, మనం కొంత కాలం వేచి ఉండాలని నాతో కొంతమంది చెప్పారు' అని ఆయన బుధవారం తెలియజేశారు.
ఒబామా అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా అధికార ప్రసంగం చేస్తూ, 'ఈ వాదనలు చేసేవారికి నాదొకటే ప్రశ్న. ఎంతకాలం మనం వేచి ఉండాలి? అమెరికా తన భవిష్యత్తును ఇలా ఎంత కాలం నిలిపి ఉంచుకోవాలి?' అని అన్నారు. 'సమస్యలు అంతకంతకు సంక్లిష్టంగా మారిపోతుండగా వేచి ఉండవలసిందిగా వాషింగ్టన్ దశాబ్దాలుగా మమ్మల్ని కోరుతున్నది' అని ఆయన చెప్పారు.
'ఈలోగా చైనా తన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి నిరీక్షించడం లేదు. జర్మనీ వేచి చూడడం లేదు. ఇండియా కూడా వేచి ఉండడం లేదు' అని ఆయన చెప్పారు. 'ఈ దేశాలు స్తంభించిపోలేదు. ఈ దేశాలు రెండవ స్థానం కోసం చూడడం లేదు. ఇవి లెక్కలు, సైన్స్ లకు మరింత ప్రాముఖ్యం ఇస్తున్నాయి. పరిశుద్ధమైన ఇంధన శక్తిపై ఇవి మరింత శ్రద్ధతో పెట్టుబడులు పెడుతున్నాయి. ఆ ఉద్యోగాలను ఇవి కోరుకుంటుండడమే ఇందుకు కారణం' అని ఒబామా పేర్కొన్నారు.
'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు రెండవ స్థానాన్ని నేను అంగీకరించను' అని ఒబామా స్పష్టం చేశారు. 'అది కష్టమే కావచ్చు, చర్చల వలె ఇబ్బందికరమైనవి, వివాదాస్పదమైనవి కావచ్చు, కాని మన వృద్ధికి అవరోధంగా ఉన్న సమస్యలను అధిగమించడంపై మరింతగా దృష్టి నిలపవలసిన తరుణం ఆసన్నమైంది' అని ఆయన సూచించారు. 'ఆర్థిక సంస్కరణలతో ఇందుకు నాంది పలకాలి' అని ఆయన కోరారు. 'మన మొత్తం ఆర్థిక వ్యవస్థను దాదాపుగా కుప్పకూల్చిన అజాగ్రత్త, అలక్ష్య వైఖరిని తిరిగి అనుసరించకుండా జాగ్రత్తపడుతూ దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక మార్కెట్ ను నిర్మించుకోవాలి' అని ఒబామా పిలుపు ఇచ్చారు.
News Posted: 28 January, 2010
|