'ఇండియాకు వెళ్ళొద్దు' వాషింగ్టన్ : భారతదేశం పర్యటనలను వీలైతే రద్దు చేసుకోవాలని తమ పౌరులకు అమెరికా ప్రభుత్వం సలహా ఇచ్చింది. భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తమకు ఇంకా సమాచారం అందుతూనే ఉందని పేర్కొంది. 'ఇండియాలో భద్రతపై ప్రస్తుతం ఏర్పడిన భయాందోళనల గురించి యుఎస్ పౌరులను విదేశాంగ శాఖ హెచ్చరిస్తున్నది. ఇండియాలో దాడులకు ఉగ్రవాద గ్రూపులు పథకాలు పన్నుతుండవచ్చునని యుఎస్ ప్రభుత్వానికి ఇంకా సమాచారం అందుతూనే ఉన్నది' అని యుఎస్ విదేశాంగ శాఖ తన తాజా అలర్ట్ లో పేర్కొన్నది.
యుఎస్ పౌరులు లేదా పాశ్చాత్య దేశాల పౌరులు సందర్శించేవిగా లేదా సమావేశమయ్యేవిగా పేరొందిన లక్ష్యాలపై దాడులు సాగించగల సామర్థ్యం, ఆకాంక్ష తమకు ఉన్నాయని ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు నిరూపించారు. పర్యటనలకు సంబంధించిన గత డిసెంబర్ 29న జారీ చేసిన హెచ్చరిక గడువు ఏప్రిల్ 30న ముగియనుండడంతో తాజాగా ఈ అలర్ట్ ప్రకటన విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ వివరించింది.
హోటళ్లు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను టెర్రరిస్టు గ్రూపులు ప్రధానంగా లక్ష్యం చేసుకుంటున్నాయనడానికి ముంబై దాడులు తార్కాణమని విదేశాంగ శాఖ పేర్కొంటూ, భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దని తన దేశీయులను కోరింది. 'స్థానిక వార్తలపై దృష్టి పెడుతుండాలని, మతపరమైన ప్రదేశాలతో సహా బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద, విహార కేంద్రాలను ఎంచుకునేటప్పుడు అక్కడ ఎటువంటి భద్రత ఉన్నదో గమనిస్తుండాలని యుఎస్ పౌరులకు సలహా ఇవ్వడమైనది' అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది.
News Posted: 29 January, 2010
|