'టి' కమిటీ సారథి శ్రీకృష్ణ? న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న జ్యుడీషియల్ కమిటీకి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణ సారథ్యం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన పేరుకు ఇటు ప్రభుత్వంలోను, అటు కాంగ్రెస్ పార్టీలోను ఉన్నత స్థాయిలో ఆమోద ముద్ర లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. తరుణ్ చటర్జీ, శివరాజ్ పాటిల్, ఎ.ఆర్. లక్ష్మణన్ వంటి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగలరు' అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను ఈ కమిటీ ప్రాతిపదికగా చేసుకుంటుంది. రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఒక విధానాన్ని రూపొందించేందుకు, (తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ) సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీ ప్రయత్నిస్తుంది. ఈవిషయంలో అనుసరించవలసిన పద్ధతులను, కావలసిన వ్యవధిని కమిటీ సూచిస్తుంది.
ఈ అంశంపై వివిధ వర్గాల అభిప్రాయాలను కమిటీ సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినట్లయితే, కృష్ణ, గోదావరి నదీ జలాలు, సహజ వనరుల పంపకం, హైదరాబాద్ భవితవ్యం, ప్రభుత్వ అధికారుల మార్పిడి, తెలంగాణలో చాలాకాలం క్రితమే స్థిరపడిన ఆంధ్ర, రాయలసీమ వాసుల భవిష్యత్తు వంటి ముఖ్యమైన అంశాలను కూడా కమిటీ పరిశీలించవచ్చు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడదీసి ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్రంలో పూర్వపు నైజాం రాష్ట్రాన్ని విలీనం చేసినప్పుడు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు తెలంగాణ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయరాదని ముఖ్యమంత్రులిద్దరి మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరిందని ఆ వర్గాలు గుర్తు చేశాయి.
కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉంటారో వెల్లడించకుండానే కమిటీ ఏర్పాటు గురించి గురువారం మాట్లాడిన చిదంబరం ఈ విషయమై వచ్చే వారం ప్రకటన చేయనున్నట్లు తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్రిక్త వాతావరణాన్ని మరింత చల్లబరిచే ఉద్దేశంతోనే గురువారం కమిటీ గురించి ప్రకటన చేసినట్లు సీనియర్ కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. ఈ అంశంపై తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) జనవరి 28న డెడ్ లైన్ విధించడం, ఆలోగా రాష్ట్రం ఏర్పాటుపై నిర్దిష్ట ప్రకటన వెలువడకపోతే ఈ ప్రాంతానికి చెందిన ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామా లేఖల ఆమోదానికి ఒత్తిడి తీసుకురాగలమని బెదరించడం ఈ ప్రకటన చేయడానికి కారణమని ఆయన వివరించారు.
News Posted: 30 January, 2010
|