అపూర్వ సహోదరులు న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారిగా సోదరులు ఇద్దరు రెండు భారీ భద్రతా దళాలకు అధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డిజి) రామన్ శ్రీవాత్సవ పని చేస్తుంటే ఆయన తమ్ముడు విక్రమ్ శ్రీవాత్సవ్ ఆదివారం కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్ పిఎఫ్) డిజిగా బాధ్యతలు స్వీకరించారు. రామన్ శ్రీవాత్సవ్ 1973 బ్యాచ్ కేరళ కేడర్ ఐపిఎస్ అధికారి కాగా విక్రమ్ 1973 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ (యుపి) ఐపిఎస్ అధికారి. విక్రమ్ ఇంతకుముందు భారత, టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటిబిపి) దళం డిజిగా బాధ్యతలు నిర్వహించారు. నిరుడు ఫిబ్రవరి నుంచి సిఆర్ పిఎఫ్ కు సారథ్యం వహిస్తున్న ఎ.ఎస్. గిల్ స్థానంలో ఇప్పుడు విక్రమ్ శ్రీవాత్సవ్ నియామకం జరిగింది. జాతీయ వైపరీత్యాల సహాయక దళం (ఎన్ డిఆర్ఎఫ్) డిజి రంజిత్ కుమార్ భాటియా ఇప్పుడు ఐటిబిపికి సారథ్యం వహిస్తారు.
కొత్త అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన విక్రమ్, 'భద్రతా దళాలు నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సిఆర్ పిఎఫ్ దేశ భద్రతపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది' అని చెప్పారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా), నక్సలైట్ల కార్యకలాపాలను అరికట్టేందుకు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారని విలేఖరులు ప్రశ్నించినప్పుడు, 'ఈ వ్యూహానికి సంబంధించిన వివరాలను నేను మీడియాకు తెలియజేయను. అయితే, సిఆర్ పిఎఫ్ సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తుందని మాత్రం మీకు భరోసా ఇవ్వగలను' అని కొత్త డిజి సమాధానం ఇచ్చారు.
ఝార్ఖండ్ లో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యాచరణ ప్రణాళికపై ప్రశ్నకు విక్రమ్ సమాధానం ఇస్తూ, 'ఈ అంశాలపై నేను తరువాత మాట్లాడతాను. నేను ఇప్పుడే బాధ్యతలు చేపట్టాను. కొంత కాలం తరువాత నేను ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వగలను' అని చెప్పారు.
సిఆర్ పిఎఫ్ కు సారథ్యం వహించేందుకు సిద్ధమవుతున్న విక్రమ్ శ్రీవాత్సవ్ విలేఖరులతో తన మనోభావాలను పంచుకుంటూ, 'దేశానికి సేవ చేయడం నా బాధ్యత. పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ తన విధిని నిర్వర్తిస్తున్నారు' అని పేర్కొన్నారు. కాగా, తాను పుట్టిన తేదీకి, తన అన్న జనన తేదీకి మధ్య దాదాపు ఐదు నెలలు మాత్రమే అంతరం ఉండడం గురించిన ప్ర్రశ్నకు విక్రమ్ సమాధానం ఇస్తూ, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలించారని చెప్పారు.
News Posted: 1 February, 2010
|