పసిడి యుద్ధం న్యూఢిల్లీ : ప్రభుత్వం 1975లో స్వాధీనం చేసుకున్న 800 కిలోల బంగారాన్ని తిరిగి రాబట్టుకోవడానికై జైపూర్ మాజీ మహారాణి స్వర్గీయ గాయత్రీ దేవి వారసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 1968నాటి స్వర్ణ నియంత్రణ చట్టం కింద నిర్దేశించిన విధంగా ఆ బంగారం గురించి ఆదాయపు పన్ను (ఐటి) శాఖ అధికారులకు ఆమె భర్త, స్వర్గీయ మహారాజా సవాయ్ మాన్ సింగ్ సమాచారం అందజేయనందుకు ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకున్నది. ఈ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేశారు.
గాయత్రీ దేవి నిరుడు జూలై 29న మరణించిన తరువాత ఆమె పెద్ద కుమారుడు బ్రిగేడియర్ (రిటైర్డ్) సవాయ్ భవానీ సింగ్ 1980లో ఢిల్లీలో స్వర్ణ నియంత్రణ విభాగం అధిపతి జారీ చేసిన ఉత్తర్వును సవాల్చేశారు. 'మొత్తం బంగారం గురించి స్వర్ణ నియంత్రణ చట్టం కింద వెల్లడించలేదని భావించేందుకు మాకేమీ కారణం కనిపించడం లేదు' అని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే, స్వర్ణ నియంత్రణ చట్టం, 1968 నాటి భారతీయ రక్షణ నియమావళి కింద ముడి బంగారం దగ్గర ఉంచుకోవడం అక్రమమని, అది బయటపడినట్లయితే ఆరు నెలలలోగా అధీకృత విక్రేతలకు లేదా స్వర్ణకారునికి విక్రయించవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎస్.కె. దుబే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. మురళీధర్ తో చెప్పారు. ఆ కుటుంబ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు, వారికి ఇంత వరకు కోటిన్నర రూపాయల జరిమానా విధించినట్లు, ఈ జరిమానాను ఆతరువాత రూ. 80 లక్షలకు తగ్గించినట్లు కూడా దుబే తెలియజేశారు. దుబే తన వాదనలను సోమవారం కూడా కొనసాగించవచ్చు.
1971 భారత - పాకిస్తాన్ యుద్ధంలో తాను ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను తనకు మహా వీర్ చక్ర ప్రదానం చేసిన విషయాన్ని బ్రిగేడియర్ భవానీ సింగ్ తన పిటిషన్ లో ప్రస్తావించారు. ఐటి శాఖ స్వాధీనం ఉత్తర్వును తోసిపుచ్చాలని, అది చెల్లదని ప్రకటించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. 'దేశం పట్ల అంత ఎక్కువ స్థాయిలో అంకితభావం ప్రదర్శించిన వ్యక్తి కావాలని దేశ చట్టాలను ఉల్లంఘించడు' అని ఆయన పేర్కొన్నారు.
News Posted: 1 February, 2010
|