రోడ్ల పనిలో నీలేకని! లండన్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన యూఐడీ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్న నందన్ నీలేకని మరో సరికొత్త సాఫ్ట్ వేర్ కు కూడా రూపకల్పన చేయనున్నారు. కేంద్ర మంత్రి కమల్ నాథ్ వినతి మేరకు ఆయన ఈ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. జాతీయ రహదారుల్లో టోల్ గేట్ల్ నిర్వహణ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి కమల్ నాథ్ ఇటీవల నందన్ నీలేకనిని కోరారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో వాహనదారుల నుండి రుసుం వసూలు చేసేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియెగించాలని భావిస్తున్నట్లు మంత్రి కమల్ నాథ్ చెప్పారు. ఈ మేరకు నందన్ నీలేకని సహాయం కోరామని మంత్రి వివరించారు.
లండన్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోందని, 2010 లో రోజుకు 20 కిలోమీటర్ల దూరం మేరకు నిర్మాణం జరుపాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ ఏడాది జూలై లోగా వీటి పనుల వేగాన్ని మరింత పెంచి రోడ్లు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో రహదారుల మౌలిక వసతుల కల్పనకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 2 లక్షల పాతిక వేల కోట్ల రూపాయల (40 నుండి 45 బిలియన్ డాలర్ల) వరకూ ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని మంత్రి వివరించారు. అయితే ప్రస్తుతానికి ఏటా 10 బిలియన్ ల డాలర్ల మేరకు పెట్టుబడులు వస్తున్నాయని కమల్ నాథ్ చెప్పారు. రహదారుల మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులకు భారత్ పలు రాయితీలు కల్పిస్తోందని, తాము పెట్టబడుదారుల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు దావోస్ సదస్సులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. రహదారుల మౌలిక వసతుల కల్పనకు లండన్ లోని ఫ్రెంచి కంపెనీ ఇక్వీటీ, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడులకు సంసిద్థత వ్యక్తం చేసిందన్నారు. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఒప్పందంలో చేసిన మార్పలు తమపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం లేదని కమల్ నాథ్ కొట్టిపారేసారు.
దేశంలోని చాలా హైవే లను డిబిఎఫ్ ఓటి ( రూపకల్పన, నిర్మాణం, ఫైనాన్స్, నిర్వహణ, బదలాయింపు) పద్ధతిని తాము నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. రోడ్డును అభివృద్ధిలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు తమ సొమ్మును టోల్ ప్లాజా వసూళ్ల ద్వారా వసూళ్లు చేసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు. రానున్న మూడు నెలలల్లో లక్ష కోట్ల రూపాయల విలువైన 60 నుండి 70 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ కు చెందిన ఐవిఆర్ సీ ఎల్, ఢిల్లీకి చెందిన ఈరా ఇన్ ఫ్రా కంపెనీలు చెరో వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్టులను దక్కించుకున్నాయని కమల్ నాథ్ తెలిపారు. భారత జాతీయ రహదారుల సంస్థ గతంలో చేపట్టిన ప్రాజెక్టుల కంటే ఈ సారి చేపడుతున్నవి చాలా పెద్ద ప్రాజెక్టులని ఆయన పేర్కొన్నారు. దాదాపు డజన్ వరకు మెగా ప్రాజెక్టులు ఉన్నాయని, వీటి విలువ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటుందని కమల్ నాథ్ చెప్పారు.
News Posted: 3 February, 2010
|