షారూక్ వెంట బిజెపీ న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ను వెనకేసుకుని రావడం ద్వారా భారతీయ జనతా పార్టీ వెనకటి తన ముద్రలను తుడిచేసుకోడానికి ప్రయత్నిస్తోంది. ఐపిఎల్ లో పాకిస్తాన్ క్రికెటర్లను తీసుకోకపోవడంపై షారూక్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై మండిపడుతున్న శివసేన, అతనిపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించింది. దానికి షారూక్ కూడా ధీటుగానే స్పందించడంతో వాగ్వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ రెండు గ్రూపులుగా విడిపోయింది. అనేక రాజకీయ పార్టీలు కూడా షారూక్ తో స్వరం కలిపాయి. 'మహారాష్ట్రీయన్లదే ముంబయి' అంటున్న శివసేన ప్రచారాన్ని ఘాటుగా తిప్పికొట్టి ఇప్పటికే కాషాయాంబరధారితో కలబడిన కమలనాథులు తాజాగా షారూక్ ఖాన్ను వెనకేసుకొస్తున్నారు. షారూక్ 'దేశద్రోహి', 'భారత్ శత్రువు' అని అభివర్ణిస్తూ చేస్తున్న శివసేన ప్రచారాన్ని బిజెపీ బలంగా తిప్పికొడుతోంది. షారూక్ ఖాన్ భారత్ గర్వించే ఎన్నో పనులు చేశారని కొనియాడుతోంది.
బిజెపీ సీనియర్ నాయకుల కోసం షారూక్ కొత్త సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని శుక్రవారం ప్రత్యేక ఆటను ప్రదర్శించారు. ఫిబ్రవరి 12న విడుదల అయ్యే ఈ సినిమాను ముంబయిలో ప్రదర్శించరాదని శివసేన కార్యకర్తలు ఇప్పటికే థియేటర్ యజమానులకు హెచ్చరికలు చేశారు. మహారాష్ట్ర యువ బిజెపీ నేత షైనా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. షారూక్ తనుకు చాలా మంచి మిత్రుడుని, అందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశానని షైనా వివరించారు. తన భావాలను వెల్లడించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని, అలా అభిప్రాయాలు వెల్లడించిన వారిని ఎవరూ లక్ష్యంగా చేసుకోరాదని షైనా పేర్కొన్నారు.
వాస్తవానికి షారూక్ ఎనాడూ బిజెపీకి మద్దతు తెలపలేదు. పైగా యువ గాంధీలకు మిత్రుడు కూడా. ఒక విధంగా బిజెపీ వ్యతిరేకి. అయినప్పటికీ షారూక్ ను బిజెపీ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇది బిజెపీలో వస్తున్న మార్పులకు సంకేతంగానే భావించాలి. తన ఎత్తుగడలను బిజెపీ సమూలంగా మార్చుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన తరువాత, నితిన్ గడ్కారీ పగ్గాలు చేపట్టిన తరువాత వైఖరి మార్చుకుంటోంది. పిడివాదం నాయకులు బిజెపీలో మౌనం వహిస్తున్నారు. శివసేన వైఖరిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ బహిరంగంగా విమర్శించడం ద్వారా బిజెపీ నాయకత్వానికి సూచనప్రాయ దిశా నిర్దేశం చేశారు.
షారూక్ ఖాన్ కు యువతలో కోకోల్లలుగా అభిమానులు ఉన్న విషయాన్ని గమనించిన బిజెపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్ లో బిజెపీ మరింత ఆధునికంగా ఉంటుందని, ఊహాలోక విహారాలు ఉండవని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
News Posted: 5 February, 2010
|