పారిఖ్ పై త్వరలో నిర్ణయం న్యూఢిల్లీ : ఆయిల్ ధరలపై నియంత్రణను తప్పించాలని, కిరోసిన్, వంట గ్యాస్ ధరలను పెంచాలని పారిఖ్ బృందం చేసిన సిఫార్సులపై బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే తాను నిర్ణయం తీసుకోవచ్చునని ప్రభుత్వం గురువారం సూచించింది. 'ఈ బృందం సిఫార్సులపై వచ్చే వారానికల్లా మంత్రిత్వశాఖ తన అభిప్రాయాలను తెలియచేవచ్చు. ఆతరువాత అవి మంత్రివర్గం పరిశీలనకు వెళతాయి' అని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి మురళీ దేవరా గురువారం న్యూఢిల్లీలో విలేఖరులతో చెప్పారు. మరి మంత్రివర్గం ఎప్పుడు నిర్ణయం తీసుకోవచ్చుననే ప్రశ్నకు మురళీ దేవరా అతి త్వరలో అని సమాధానం ఇచ్చారు. 'బడ్జెట్ కు ముందే కావచ్చు కూడా' అని ఆయన సూచించారు.
కీర్తి పారిఖ్ అధ్యక్షతన ప్రధాని నియమంచిన ఈ నిపుణుల బృందం పెట్రోల్, డీజెల్ ధరలపై నియంత్రణను తొలగించాలని, ఎల్ పిజి ధరను సిలిండర్ కు రూ. 100 మేరకు, కిరోసిన్ ను లీటర్ కు రూ. 6 మేరకు పెంచాలని బుధవారం సిఫార్సు చేసిన విషయం విదితమే.. మోటారు వాహనాల ఇంధన ధరలపై నియంత్రణను రద్దు చేయడం వల్ల పెట్రోల్ ధర లీటర్ కు రూ. 4.72 మేరకు, డీజెల్ ధర లీటర్ కు రూ. 2.33 మేరకు పెరుగుతాయి.
ప్రభుత్వం ఈ బృందం నివేదికను పూర్తిగా ఆమోదించకపోవచ్చునని, సామాన్యుని ప్రయోజనాలను పరిరక్షిస్తుందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అంతకుముందు సూచనప్రాయంగా తెలియజేశారు. 'ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల ఆర్థిక పరిస్థితిని కాపాడుతూనే ప్రభుత్వం నిరుపేదలపైన, సామాన్యులపైన పడే భారం కనీస స్థాయిలో పడేలా జాగ్రత్త వహిస్తుంది' అని జితిన్ ప్రసాద చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రస్తుతం పెట్రోల్, డీజెల్, ఎల్ పిజి, కిరోసిన్ లను దిగుమతి వ్యయం కన్నా తక్కువ ధరకు విక్రయించడం ద్వారా రోజుకు రూ. 180 కోట్ల మేరకు నష్టపోతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో వాటికి వాటిల్లే నష్టాలు రూ. 46,030 కోట్లని అంచనా.
News Posted: 5 February, 2010
|