బ్రిటన్ ఎంట్రీ కష్టమే లండన్ : స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియను బ్రిటన్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. విద్యార్థి వీసాలతో దేశంలోకి అక్రమ వలసలను నియంత్రించేందుకుగాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం పేరుతో పలువురు విద్యార్ధులు బ్రిటన్ కు వెళ్లి చదువుతో పాటు అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇకపై ఆ అవకాశం లేకుండా వీసా జారీకి కొత్త నిబంధనలను జారీ చేసింది. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు ఉద్యోగం చేసేందుకు వీలు లేకుండా చేసింది. బ్రిటన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణంగా ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు విద్యార్థుల వీసాలు కూడా సస్పెండ్ కానున్నాయి. 2008-09 సంవత్సరాల్లో భారత్ నుండి బ్రిటన్ కు 2.4 లక్షల మంది విద్యార్థులు వెళ్లారు.అయితే వీసా నిబంధనల కఠినతరం కారణంగా ఇకపై ఈ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
బ్రిటన్ రూపొందించిన తాజా నిబంధనల ప్రకారం యూరోపియన్ దేశాలు కాకుండా ఇతర దేశాల నుండి వచ్చే విద్యార్థులకు ఆంగ్లభాషలో విశేష ప్రావీణ్యం ఉండాల్సిందే. అలాగే డిగ్రీ కంటే కిందిస్థాయి విద్యను అభ్యసించే విద్యార్థులు ఇప్పటివరకు వారానికి 20 గంటలు పని చేస్తుండగా, బ్రిటన్ ప్రభుత్వం దానిని ఇకపై కేవలం 10 గంటలకే పరిమితం చేసింది. అలాగే ఆరునెలల గడువు కలిగిన కోర్సులను చదివే విద్యార్థులు తమతో పాటు ఎవరినీ తీసుకురాకూడదని తాజా నిబంధనల్లో పేర్కొంది. అలాగే డిగ్రీలోపు కోర్సులను చదివే విద్యార్థులతో పాటు బ్రిటన్ కు వచ్చే వారు కూడా అక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే బ్రిటన్ లో డిగ్రీ స్థాయిలోపు కోర్సులను చదవాలంటే విద్యార్థులు ఆయా విద్యాసంస్థల ఉన్నత స్థాయి జాబితాలో చోటు సంపాదించాల్సి ఉంటుంది.
వీసా నిబంధనల కఠినతరం చేయడంపై బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి అలన్ జాన్సన్ మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులకు తమ దేశం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుందని వెల్లిడించారు. అయితే విద్యార్థి వీసాతో వచ్చిన వారు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు ఇటువంటి అక్రమాలను కట్టడి చేసేందుకు తాము వీసా నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని వివరించారు. విద్యార్థి వీసాతో వచ్చిన అభ్యర్థులు తమ అభ్యాసం పట్ల పూర్తిస్థాయి శ్రద్ధ కనబరచకుండా ఉపాధి వైపు మళ్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త వీసా నిబంధనలను తాము కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
News Posted: 7 February, 2010
|