పుతిన్ నెచ్చెలి మిస్సింగ్ మాస్కో : రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ నెచ్చెలి, ఆయన ప్రేమాంకురంగా భావిస్తున్న శిశువుకు తల్లి అయిన అలీనా కబయెవా హఠాత్తుగా అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ జిమ్నాస్ట్ చాంపియన్ కబయెవా 2006 నుంచి పుతిన్ కు రహస్య స్నేహితురాలని తెలుస్తున్నది. 57 సంవత్సరాల పుతిన్ కన్నా ఆమె 30 సంవత్సరాలకు పైగా చిన్న. పుతిన్ ప్రేమాంకురం, నిరుడు జన్మించిన ఆ శిశువుకు డిమిట్రీ అని పేరు పెట్టినట్లు సమాచారం.
రష్యా ప్రధాని సహచరి, అందమైన, 5.4 అడుగుల ఎత్తున్న 26 సంవత్సరాల అలీనా కబయెవా ఉన్నట్లుండి మాయమైనట్లు 'న్యూయార్క్ పోస్ట్' పత్రిక తెలియజేసింది. పుతిన్ నెచ్చెలి కబయెవా స్నేహితురాలిని 'న్యూయార్క్ పోస్ట్' ఉటంకిస్తూ, 'ఆమె ఫోన్ నంబర్లన్నీ డిస్కనెక్ట్ అయ్యాయి. ఐదుగురు మాత్రమే ఆమెతో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు ఆమె మాజీ కోచ్, ఆమె తల్లిదండ్రులు, డ్యూమా (రష్యన్ పార్లమెంట్)లో సభ్యులైన మరి ఇద్దరు జిమ్నాస్ట్ లు' అని తెలియజేసింది. 'ఇది పుతిన్ సాధారణంగా అనుసరించే పద్ధతి. షర్ట్ లేకుండా తాను ఫోటోలు తీయించుకోవడానికి, సైబీరియాలో పులులను వేటాడుతున్నప్పుడు తప్ప ఆయన ఎప్పుడూ పత్రికలవారిని ద్వేషిస్తుంటారు' అని ఆ పత్రిక పేర్కొన్నది.
రష్యాలో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందిన ఆ జిమ్నాస్ట్ క్రీడ నుంచి కబయెవా రిటైరైన తరువాత ఆమెతో పుతిన్ రహస్యంగా సంబంధం పెట్టుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం కబయెవాను తన పార్టీ టిక్కెట్ పై రష్యన్ పార్లమెంట్ కు ఎన్నిక చేయించారు. సగం ముస్లిం అయిన కబయెవా అప్పటి సోవియెట్ యూనియన్ లోని తాష్కెంట్ లో జన్మించింది. తాష్కెంట్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ రాజధాని.
తన భార్య లుడ్మిలాకు విడాకులు ఇవ్వాలని పుతిన్ యోచిస్తున్నట్లు ఒక రష్యన్ వెబ్ సైట్ ఇటీవల తెలియజేసింది. వారిద్దరికి ఇద్దరు కుమార్తెలు. 'రష్యాలో ముస్లిం జనాభా దాదాపు 30 మిలియన్లనేది పరిగణనలోకి తీసుకుంటే అందమైన, సగం ముస్లిం అయిన భార్యను కలిగి ఉండడం ఆయన (పుతిన్)కు రాజకీయంగా నష్టదాయకం కాకపోవచ్చు' అని వెబ్ సైట్ వ్యాఖ్యానించింది.
News Posted: 8 February, 2010
|