'గ్రీన్ హంట్'కు రెడీ కోలకతా : మావోయిస్టులు కనుక హింసాకాండకు స్వస్తి చెప్పని పక్షంలో వారి ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని కేంద్రం మంగళవారం ప్రకటించి వారికి స్పష్టమైన హెచ్చరిక సంకేతాన్ని పంపింది. ప్రస్తుతం నక్సల్స్ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతాలను ఆరు నెలలలోగా తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలకు ప్రమేయం కల్పిస్తూ ఒక సమగ్ర అంతర్ రాష్ట్ర సమష్టి దాడి కార్యక్రమం (ఆపరేషన్ గ్రీన్ హంట్)ను త్వరలో ప్రారంభించనున్నారు.
కోలకతాలో రైటర్స్ బిల్డింగ్స్ (పశ్చిమ బెంగాల్ సచివాలయం)లో పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, నలుగురు ముఖ్యమంత్రులలో బుద్ధదేవ్ భట్టాచార్జీ (పశ్చిమ బెంగాల్), నవీన్ పట్నాయక్ (ఒరిస్సా) మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.
'బెంగాల్, ఝార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా మధ్య అంతర్ రాష్ట్ర దాడులు ప్రారంభించడం గురించి మేము చర్చించాం. నిర్ణయాలు తీసుకున్నాం. నేను ఢిల్లీకి తిరిగి వెళ్ళిన తరువాత ఈ నిర్ణయాల అమలు జరుగుతుంది' అని చిదంబరం తెలియజేశారు. సమగ్ర అంతర్ రాష్ట్ర ఉమ్మడి దాడి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించాలని నాలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, ఇందు కోసమే అవి మరిన్న కేంద్ర బలగాలను కోరుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టు బెడదను ఎదుర్కొనేందుకు తమ వద్ద తగిన ప్రాథమిక సరంజామా, ఏర్పాట్లు లేవని ఝార్ఖండ్ ప్రభుత్వం అంగీకరించిందని ఆ వర్గాలు తెలిపాయి. రక్షణ కార్యక్రమాలకు హెలికాప్టర్లను, మావోయిస్టు బాధిత ప్రాంతాలలో నిఘా వేసేందుకు మానవరహిత విమానాలను సమకూర్చాలని కేంద్రానికి బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని ఆ వర్గాలు తెలిపాయి.
మావోయిస్టులు హింసాకాండకు స్వస్తి పలికినట్లయితే వారితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా చిదంబరం స్పష్టం చేశారు. 'మీరు హింసాకాండను నిలిపివేసినట్లయితే మీతో ఏ విషయంపైనైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని నక్సల్ బాధిత రాష్ట్రాల తరఫున, ముఖ్యమంత్రులందరి తరఫున నేను నక్సల్స్ కు విజ్ఞప్తి చేస్తున్నాను' అని చిదంబరం పేర్కొన్నారు.
News Posted: 10 February, 2010
|