రూరల్ స్కీంలో హైటెక్ న్యూఢిల్లీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజిఎస్) లబ్ధిదారులకు వేతనాల చెల్లింపు కోసం స్మార్ట్ కార్డ్ ఆధారిత 'ఎలక్ట్రానిక్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (ఇబిటి)' విధానాన్ని పూర్తిగా అనుసరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో వివిధ బ్యాంకులు అమలు జరుపుతున్న పైలట్ ప్రాజెక్టుల ఫలితాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఎన్ఆర్ఇజిఎస్ చెల్లింపులు అసలు లబ్ధిదారునికి చేరేందుకు ఒక నెల వ్యవధి పడుతున్నది. ఇబిటిని పూర్తిగా అమలు జరిపినప్పుడు ఈ చెల్లింపులు ఒక రోజులోనే లబ్ధిదారునికి అందుతాయి.
బ్యాంకులు అన్ని గ్రామ పంచాయతీలలో 'బ్యాంకింగ్ ఔట్ పోస్ట్'లను ఏర్పాటు చేస్తాయి. వీటిని ఒక సాంకేతిక వేదిక ద్వారా అనుసంధానిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 26న తన బడ్జెట్ ప్రసంగంలో స్మార్ట్ కార్డ్ ఆధారిత పథకం అమలుకు ఒక ప్రాతిపదిక (రోడ్ మ్యాప్)ను సూచించగలరని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
2005లో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఇజిఎస్ కింద ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) జీవిస్తున్న ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒక సభ్యునికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించవలసి ఉంటుంది. దేశంలోని 626 జిల్లాలలో ఈ పథకం వల్ల ఏటా దాదాపు 44.1 మిలియన్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
'అన్ని ప్రయోజనాలు నిర్దిష్ట వ్యవధిలో బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే వ్యక్తులకు అందేలా ఆయా ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో కృషి చేయవలసిందిగా బ్యాంకులకు ప్రభుత్వ సలహా ఇచ్చింది' అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు చైర్మన్ తెలియజేశారు. తన పేరు వెల్లడి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఒరిస్సా ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకోగా కర్నాటకలో ఎంపిక చేసిన కొన్ని జిల్లాలలో ఇటువంటి ప్రాజెక్టును సిండికేట్ బ్యాంక్ అమలు చేస్తున్నది.
News Posted: 10 February, 2010
|