నాగ్ కు 'ఎయిర్' షాక్ హైదరాబాద్ : పాపం...నాగార్జున.. తాను కన్న కలలన్నీ కల్లలయ్యాయి. తమ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో భారీ వినోద భవన సముదాయాన్ని నిర్మంచాలనుకున్న నాగార్జున ప్లాన్ ను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నిలువునా కుప్పకూల్చింది. నిబంధనలకు విరుద్ధమైన భవన నిర్మణానికి తాము అనుమతిచ్చేది లేదంటూ తేల్చి చెప్పి రీల్ హీరోకు రియల్ షాక్ ను ఇచ్చింది ఎఎఐ. నాగార్జున, ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తమ రాజకీయ పైరవీలు చేసినప్పటీకీ ఎఎఐ ముందు అవేవీ చెల్లలేదు.
బంజారా హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో (వినోద భవన సముదాయం)మెగా ఎంటర్ టైన్ మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని నాగార్జన ప్రణాళిక సిద్ధం చేసారు. 30 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించాలని ఆయన భావించారు. విమానాలు రాకపోకలు సాగించే ఆకాశ మార్గంలో ఉన్నందున బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 15 మీటర్ల ఎత్తుకు మించి భవంతులు నిర్మించరాదని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నిబంధనలు రూపొందించింది. ఎయిర్ పోర్ట్స అథారిటీ కూడా ఈ ప్రాంతంలో అంత ఎత్తైన నిర్మాణాలు చేసుకునేందుకు వీలులేకుండా నియమాలను తయారు చేసింది.
కాబట్టి నాగార్జున నిర్మించాలనుకుంటున్న భవనానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నుండి నో అబ్జెక్షన్ పత్రాన్ని కూడా నాగ్ తెచ్చుకోవాలి. ఈ మేరకు 30 మీటర్ల ఎత్తులో భవన నిర్మాణానికి అనుమతివ్వాలని నాగార్జున తొలుత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డవలప్ మెంట్ విభాగాన్ని లేఖ ద్వారా అభ్యర్థించారు. నాగ్ అభ్యర్థనను పరిశీలించిన ఆ విభాగాధికారులు జిహెచ్ ఎంసి ని సంప్రదించాలని సూచించారు. జిహెచ్ ఎంసి ని నాగ్ ఆశ్రయించగా ఎయిర్ పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) అనుమతి పొందాలని, వారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేటన్ పొందాలని సూచించింది. దీంతో తన కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతివ్వాలంటూ ఎఎఐని నాగార్జున సంప్రదించగా, నిబంధనలకు విరుద్దమైన నిర్మాణాలకు తాము అనుమతిచ్చేది లేదంటూ ఆ సంస్థ తిరస్కరించింది. బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్ ప్రాంతాలు ఏవియేషన్ పరిధిలో ఉన్నందున తాము అనుమతివ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు AAI/HY/ATS/-59/NOC-2 పేరిట నాగార్జునకు లేఖ కూడా పంపింది. దీని ప్రతిని జిహెచ్ ఎంసీకీ అందచేసింది.
News Posted: 11 February, 2010
|