22 హత్యలకు ప్లాన్! బుడాపెస్ట్ : మొత్తం 22 మందిని హతమార్చాలని సంకల్పించుకున్నట్లు ఒక యువకుడు చెప్పిన మాటలు విన్న పోలీసులే విస్తుపోయారు. ఆనక అతనిని అరెస్ట్ చేశారు కూడా. తన జీవితంలో '22 చెడు సంవత్సరాలు' ఉన్న కారణంగా 22 మందిని హతమార్చాలని పథకం వేసినట్లు పోలీసులతో చెప్పిన ఈ 22 సంవత్సరాల హంగరీ విద్యార్థి చెప్పాడు. యువకుడిని శుక్రవారం నిర్బంధంలోకి తీసుకున్నట్లు 'ఎంటిఐ' వార్తా సంస్థ తెలియజేసింది. పోలీస్ క్రిమినల్ డైరెక్టర్ సోల్ట్ బోద్నర్ సమాచారం ప్రకారం, 'అబెల్ ఎస్'గా పోలీసులు పేర్కొన్న ఆ వ్యక్తి స్పోర్ట్స్ షూటర్. అతని వద్ద ఒక లూగర్ పారాబెల్లుమ్ పిస్టల్ ఉంది. అతను ఏడాదిన్నరగా ఈ హత్యలకు పథకం వేస్తున్నాడు.
'నాకు 22 చెడు సంవత్సరాలు ఉన్న కారణంగా' తన యూనివర్శిటీలోను, ఒక షాపింగ్ మాల్ లోను 22 మందిని కాల్చి చంపాలని అనుకున్నానని అతను చెప్పాడని బోద్నర్ ను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థ 'ఎంటిఐ' తెలియజేసింది. అయితే, ఈ విషయమై మాట్లాడేందుకు పోలీసులు అందుబాటులో లేకపోయారు.
ఆ వ్యక్తి తన పథకం విషయం ఒప్పుకున్నాడని, ఇతర దేశాలలో పాఠశాలల్లో జరిగిన మారణకాండలు బహుశా తనకు ఇందుకు ప్రేరణ ఇచ్చి ఉండవచ్చునన్నట్లుగా అతను చెప్పాడని పోలీసులు తెలియజేశారు. తాను యూనివర్శిటీకి, షాపింగ్ మాల్ కు తన పిస్టల్ ను తీసుకువెళ్ళినట్లు అతను పోలీసులతో చెప్పాడని బోద్నర్ తెలిపారు. పోలీసులు అతనిని నిర్బంధంలోకి తీసుకున్నారని, అతని ఇంటిని సోదా చేసి పిస్టల్ ను, పర్సనల్ కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ పిసిలో 1999 స్కూలు మారణకాండ ఫోటో హోమ్ పేజ్ గా అమర్చి ఉందని ఎంటిఐ తెలిపింది.
News Posted: 13 February, 2010
|