ప్రైవేట్ బడులకు 'పేద' భయం హైదరాబాద్ : పేదలకు 25 శాతం సీట్ల రిజర్వేషన్ల కల్పించవలసిన అవసరాన్ని తప్పించుకోవడానికై రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఏప్రిల్ 1 లోగా అడ్మిషన్లను పూర్తి చేసేందుకు హడావుడి పడుతున్నాయి. విద్యా హక్కు (ఆర్ టిఇ) చట్టం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది కనుక ఆలోపే అడ్మిషన్లను పూర్తి చేయాలని అవి కోరుకుంటున్నాయి. పాఠశాలలు తమ పరిసరాలలోని పేద పిల్లలకు తమ సీట్లలో 25 శాతం రిజర్వ్ చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది.
ఆర్ టిఇ చట్టాన్ని తప్పించుకోవడానికై పాఠశాలలు తమ అడ్మిషన్లను మూడు నెలలు ముందుకు జరిపాయి. అన్ని ప్రముఖ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే ముగించారు. సాధారణఁగా ప్రతి సంవత్సరం జూన్ వరకు అడ్మిషన్లను నిర్వహిస్తుండే కేటగరీ బి, కేటగరీ సి పాఠశాలలు కూడా అడ్మిషన్లకు మార్చి 31ని గడువుగా నిశ్చయించాయి. ఆ గడువులోగా ఫీజు చెల్లించి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవలసిందిగా తల్లిదండ్రులను అవి కోరుతున్నాయి.
పాఠశాల విద్యా శాఖ అధికారులు ఈవిషయంలో తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. పాఠశాలలపై నియంత్రణకు ప్రభుత్వం నుంచి తమకు నిర్దుష్టమైన ఆదేశాలు ఏవీ రాలేదని వారు తెలిపారు. కాగా, ఆర్ టిఇ చట్టంలో నిర్దేశించినట్లుగా పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్లను తాము కల్పించజాలమని, ఎందుకంటే దీని వల్ల తాము ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటామని ప్రైవేట్ పాఠశాలల అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనను అమలు పరిచే ముందు 25 శాతం రిజర్వేషన్ల కారణంగా తనకు వచ్చే నష్టం భర్తీకి ప్రభుత్వం ఏవైనా ప్రత్యామ్నాయాలను సూచించాలని వారు కోరుతున్నారు.
విద్యా హక్కు చట్టాన్ని ఏప్రిల్ 1న నోటిఫై చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 6, 14 సంవత్సరాల వయో వర్గంలోని పిల్లలకు విద్యను ఉచితం, నిర్బంధం చేస్తున్నదీ చట్టం. అనేక సార్లు విఫల యత్నం చేసిన తరువాత 2009 ఆగస్టులో పార్లమెంట్ ఈ ఆర్ టిఇ చట్టాన్ని చేసింది. చట్టం ఆమోదించిన అనంతరం గెజిట్ లో పొందుపరచినప్పటికీ ఇది ఆచరణలోకి రావాలంటే విడిగా నోటిఫికేషన్ జారీ చేయడం తప్పనిసరి అయింది.
News Posted: 15 February, 2010
|