ఏఐసిసి ముఖాలు మారవు! న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి)లో మార్పులు చేర్పుల గురించి సాగిన ఊహాగానాలు దాదాపుగా సర్దుమణిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిపరులు ఇప్పుడు కేంద్రంలో మంత్రివర్గ స్థానాల కోసం లాబీ చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే నెలకు ఒక సంవత్సరం పూర్తి కానుండడం ఇందుకు కారణం.
ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో అభిప్రాయ సరళి ఎలా ఉందంటే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతున్న ఈ దశలో మార్పులకు వారు సుముఖంగా లేరు. అంతే కాకుండా మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలలో పార్టీ సాధించిన విజయం వల్ల కూడా ఎఐసిసిలో మార్పుల చేర్పుల ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. అరడజను మంది కేంద్ర మంత్రులు కీలక రాష్ట్రాల బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ 'ఒక వ్యక్తి, ఒక పదవి' సూత్రం అమలుపై పార్టీలో ఎవరూ పట్టుబట్టడం లేదు.
పార్టీలో జనాకర్షక నేతగా రాహుల్ గాంధి ఆవిర్భావం వల్ల కూడా ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో 'ఇక ఫర్వాలేదు' అనే భావన వ్యక్తమవుతున్నది. ఆ యువ నేతకు అండగా నిలవడమే తాము చేయవలసిన పని అని పార్టీలో నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. 'రాహుల్ యుపిలో కాంగ్రెస్ పునరుత్థానానికి కారకుడయ్యారు, మహారాష్ట్రలో పార్టీని నంబర్ వన్ చేశారు. బీహార్ లో పార్టీ పునరుత్థానాన్ని సాధ్యం చేయగలరు' అని వారు చెప్పారు. రానున్న మాసాలలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రగతి సాధించగలదని వారు సూచిస్తున్నారు.
News Posted: 15 February, 2010
|