'మురికివాడల్లేని భారత్' న్యూఢిల్లీ : మురికివాడలు లేని దేశంగా భారత్ ను రూపుదిద్దాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సరికొత్త ప్రణాళికతో రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన మురికివాడలతో పాటుగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాటిని కూడా గుర్తించనున్నారు. దేశంలో ఉన్న మురికివాడలపై ఇప్పటికే కొంత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కేంద్ర గృహనిర్మాణ శాఖ భావిస్తోంది. ఇస్రో, జీఐఎస్ వంటి సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి కేంద్రప్రభుత్వం రిమోట్ సర్వే చేపట్టనుంది.
దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో అనేక మురికివాడలున్నాయి. ఈ మురికివాడలపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన పూర్తి సమాచారం లేదు. తన వద్ద ఉన్న సమాచారం కంటే అత్యధికగా మురికివాడలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో మురికివాడలపై కచ్చితమైన సమాచారం ఉంటే, తరువాత వాటిని అభివృద్ధి చేయవచ్చని కేంద్రం యోచిస్తోంది. అందుకే పూర్తి సమాచారం కోసం తాజాగా దేశవ్యాప్తంగా సర్వే జరపాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ సర్వే రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగాల ద్వారా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ ప్రాంతాలను రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా కేంద్రం సర్వే చేయిస్తుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో, జీఐఎస్ సంస్థలు అందిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ రిమోట్ సర్వేని రానున్న రెండేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కుమారి షెల్జా చెప్పారు. ఐదేళ్లలో భారత్ ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తాము కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని మురికివాడలను గుర్తించి, అక్కడి ప్రజానీకానికి రాజీవ్ ఆవాస్ యోజన (రే) పేరిట గృహాలు నిర్మిచి అందించనున్నట్లు వివరించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో మురికివాడలను గుర్తిస్తున్నామని, అంతేగాక మరిన్ని వివరాల కోసం స్లమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (మురికివాడల సమాచార విధానం)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆశించిన మేరకు స్పందన రావడం లేదని షెల్జా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నివేదికను అందిస్తే ఆ మేరకు తాము నిధులు కేటాయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు 1.4 మిలియన్ల ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు గాను 34,791 కోట్ల రూపాయలతో 1327 ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
News Posted: 15 February, 2010
|