'క్లాస్'గా క్షవరం!
మెల్ బోర్న్ : కేశాలంకరణలో డిప్ప కటింగ్ ఇపుడు యూత్ లెటేస్ట్ ట్రెండ్. దానిలోనే శిక్షణా ఇస్తామంటూ ఓ అకాడమీ వెలసి విద్యార్థులకే నిలువునా డిప్ప కటింగ్ చేసేసింది. కేశాలంకరణలో శిక్షణ ఇవ్వాలంటే ముందుగా క్షవరం చేయ్యాలి కదా. ఓ అకాడమీ సరిగ్గా అదే చేసింది. కాకపోతే చిన్నా తేడా ఉందంతే . జుట్టుకు బదులుగా విద్యార్థుల జేబులకు క్షవరం చేసింది.అది కూడా మామూలుగా కాదు ముందుగానే విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి, ఆపై బోర్డు తిప్పేసి నున్నగా గుండుకొట్టి మరీ రోడ్డుపాలు చేసేసింది. ఆకాడమీలో శిక్షణకు ముందే తమకు క్షవరం జరిగిపోవడంతో విద్యార్ధుల 'బుర్ర' గిర్రున తిరిగిపోయింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ద ఎడ్జ్ అకాడమీ పేరిట హెయిర్ డ్రెసింగ్ కాలేజీ ఏర్పాటైంది. కేశాలంకరణలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించింది. దీంతో పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఈ అకాడమీలో శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపారు. ఇండియాకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. కోర్సు ఫీజుగా 7 వేల డాలర్లను ఒక్కో విద్యార్థి నుండి వసూలు చేసింది. దీంతో ఇక కేశాలంకరణలో శిక్షణ పొందడమే తరవాయి అనుకున్న విద్యార్థులు మూసివేసి ఉన్న అకాడమీ తలుపులను చూసి తెల్లబోయారు. అకాడమీ క్షవరంలో శిక్షణ ఇస్తామని చెప్పి తమకే క్షవరం చేసిందని విద్యార్థులంతా గ్రహించారు. దీంతో ఇపుడు వారంతో లబోదిబో మంటున్నారు.
అకాడమీ చేసిన క్షవరం బాధితుల్లో న్యూఢిల్లీకి చెందిన నీల్ ఆహుజా అన్ విద్యార్థి కూడా ఉన్నాడు. తాను ఫస్ట్ సెమిస్టర్ కోసం 5 వేల డాలర్లను చెల్లించానని, ఎక్విప్ మెంట్ కోసం మరో 2000 డాలర్లు చెల్లించానని, ఇపుడు అకాడమీ మూసివేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ మొర్రో మంటున్నాడు నీల్. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ వలస విద్యార్థులకు కొత్త చట్టాలను రూపొందించందని, వీటి ప్రభావంపై తాము ముందే అకాడమీ ప్రిన్సిపల్ ని సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వర్రీ కావద్దని ఆమె భరోసా ఇచ్చి ఇపుడు బోర్డు తిప్పేసారని నీల్ గోల్లుమంటున్నాడు.
అయితే బోర్డు తిప్పేసిన ఈ అకాడమీకి నిర్వహణ అనుమతి పొడిగింపు వ్యవహారం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని తేలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల కాలంలో తాజాగా రూపొందించిన విదేశీ వలస విద్యార్థుల చట్టం కారణంగానే విద్యార్థులకు క్షవరం చేసి రాత్రి రాత్రికి బోర్డు తిప్పేసిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తన కథనంలో పేర్కొంది.
News Posted: 16 February, 2010
|