తేలు విషంతో నొప్పి మాయం! లండన్ : గంటల కొద్దీ బాధతో గింగిరాలు కొట్టించగల, మనుషుల ప్రాణాలనే తీయగల తేలు విషాన్ని అతి త్వరలో నొప్పి నివారిణి ఔషధంగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శరీర నొప్పులు తెలియకుండా ఉండేందుకు వైద్యులు మార్ఫన్ లాంటి ఇంజక్షన్లు ఇస్తున్నారు. అయితే ఇవి ప్రమాదకరమైనే కాకుండా వాటికి బానిసలయ్యే అవకాశం ఉంది. ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా తేలు విషం మానవ శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉంటే అక్కడే పనిచేసి బాధ తెలియకుండా చేయగలదని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర ఆచార్యుడు మైకేల్ గురేవిట్జ్ వెల్లడించారు. తేలు విషంలో ప్రకృతి సిద్దమైన రసాయనాలను కనుగొన్నామని, వీటిని మరింత మెరుగుపరచి నొప్పి నివారణ ఔషధానికి రూపకల్పన చేయనున్నామని ఆయన వెల్లడించారు.
తేలు విషంలోని కొన్ని రసాయనాలు, పదార్ధాలు వేల సంవత్సరాల పరిణామక్రమాని గురైనవని, వాటిలో కొన్ని ఉన్నతమైన సామర్ధ్యాన్ని, స్పష్టతను కనబరుస్తున్నాయని, వీటికి ఈ లక్షణాలు ఎలా సిద్ధించాయో మాత్రం అంతుబట్టడం లేదని ఆయన వివరించారు. తేలు విషంలోని పెప్టైడ్ విష పదార్ధం మానవ నాడీ వ్యవస్థలోని, కండర వ్యవస్థలోని సోడియం చానల్స్ తో కలుస్తున్నాయని వివరించారు. వీటిలో కొన్ని సోడియం చానల్స్ మెదడుకు నొప్పిని తెలియచేస్తాయని చెప్పారు. మానవ శరీరంలో తొమ్మిది రకాల సోడియం చానల్స్ ఉన్నాయని, వాటిలో కొన్ని సబ్ టైప్ చానల్స్ మెదడుకు నొప్పిని చేరవేస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియనే తాము అధ్యయనం చేస్తున్నామన్నారు. దీనిని కనిపెట్టగలిగితే పెప్టైడ్ విషపదార్దాల్లోని జీన్ లను స్వల్పంగా మార్పు చేయడం ద్వారా మెదడుకు నొప్పి చేరకుండా అడ్డుకోచ్చని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ దేశంలో ఉండే పచ్చ తేలు విషాన్ని ప్రయోగాలకు ఎంపిక చేశామని, దీనిలోనే 300 రకాల పెప్టైడ్స్ ఉన్నాయని ఆయన చెప్పారు.
News Posted: 17 February, 2010
|