హైవేలకు కొత్త నంబర్లు న్యూఢిల్లీ : దేశంలోని జాతీయ రహదారులకు కొత్త రూపుతో పాటుగా కొత్త నెంబర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నంబర్ల స్థానే కొత్త నంబర్లను ఈ నెలాఖరు లోగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఈ నంబర్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా క్రమ పద్ధతిలో ఉండేలా మార్పులు చేసారు. హైవేల కొత్త నంబర్లను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు, హైవే అథారిటీలకు అందచేసింది. జాతీయ రహదారులకు కొత్త నంబర్లు కేటాయింపు విధానం ప్రకారం ఇకపై దేశంలోని హైవేలకు నంబర్లు రెండంకెల్లోనే ఉంటాయి. అంతేగాక ద్వితీయ శ్రేణి హైవేలకు మూడంకెల నంబర్లు కేటాయించారు.
దేశంలోని జాతీయ రహదారులన్నీ ఉత్తర ప్రాంతం నుండి దక్షిణ ప్రాంతం వైపుగా సాగుతున్నాయి. అయితే నంబర్లు మాత్రం తూర్పు నుండి పశ్చిమ దిశగా సాగే రూట్ల ప్రకారం కేటాయించారు. దీంతో హైవేల నంబరింగ్ విధానం అస్తవ్యస్తంగా తయారైంది. ఉదాహరణకు అస్సాంలోని సిల్చార్ నుండి గుజరాత్ లోని పోర్ బందర్ హైవే తూర్పు-పశ్చిమ కారిడార్ పరిధిలో ఉంది. దీని నంబర్ ను ఎన్ హెచ్ -27గా నిర్ణయించారు. అలాగే శ్రీనగర్ నుండి కన్యకుమారికి సాగే ఉత్తర-దక్షిణాల కారిడార్ కు ఎన్ హెచ్ - 44గా నంబర్ కేటాయించారు. ఇలా అపశవ్య దిశలో నంబర్ లు సాగడాన్ని హైవేల అథారిటీ గుర్తించింది. దీంతో హైవేలకు కొత్త నంబర్లు కేటాయించాలని నిశ్చయించారు. ఇకపై సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ నంబర్లే కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తూర్పు-పశ్చిమ ప్రాంతాల్లో ప్రారంభమైన హైవేలకు తొలి ప్రాధాన్యతలో నంబర్లు కేటాయిస్తారు. అలా క్రమ పద్ధతిలో నంబర్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందని అథికారులు వెల్లడించారు.
ద్వితీయ శ్రేణి హైవేలకు మాత్రం మూడంకెలతో కూడిన నంబర్లను కేటాయించనున్నారు. 100కి పైబడిన అంకెలతో ఈ నంబర్లు ఉంటాయని హైవే అధారిటీ అధికారులు వివరించారు. హైవేలకు కేటాయిస్తున్న కొత్త నంబర్లకు ప్రజానీకం అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, అయినా గుర్తించుకోవడానికి వీలుగా ఈ ప్రక్రియను సరళతరం చేసామని పేర్కొన్నారు. 1947 సంవత్సరంలో 21,378 కిలోమీటర్ల మేరకు దేశంలో జాతీయ రహదారి విస్తరించి ఉండేదని, ఇపుడు అది 70,934 కిలోమీటర్లకు చేరిందని వివరించారు. 2021 నాటికి లక్ష కిలోమీటర్ల మేరకు హైవేలను విస్తరించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
News Posted: 18 February, 2010
|