'మాజీ పేర్లు వాడరాదు' ముంబయి : పేరులో ఏముంది..? అని ప్రశ్నించుకుంటే పేరులోనే పెన్నిధి ఉందంటున్నారు ఓ మాజీ భర్త. తాను విడాకులు ఇచ్చిన తరువాత కూడా తన పేరును, తన ఇంటి పేరును మాజీ భార్య వినియోగించుకుంటూ అప్రతిష్ట తెస్తోందంటూ సదరు మాజీ భర్త కోర్టుకెక్కాడు. ఈ కేసును విచారించిన ముంబయి హైకోర్టు విడాకులు తీసుకున్న తరువాత మాజీ భర్త పేరు వినియోగించడంపై సంచలన తీర్పు వెలువరించింది.. విడాకులు తీసుకుని విడిపోయిన తరువాత భార్య తన మాజీ భర్త పేరునుగానీ, ఇంటిపేరును గానీ వినియోగించుకునే హక్కు లేదని కోర్టు సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది.. బ్యాంక్ అకౌంట్లలో కూడా పేరును వాడరాదని ముంబయి హైకోర్టు జడ్జి జస్టిస్ రోషన్ దాల్వి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ముంబయి ఫ్యామిలీ కోర్టులో గత ఏడాది సెప్టెంబరు మాసంలో ఈ కేసును విచారించిన ప్రిన్సిపల్ జడ్జి కూడా ఇదే తీర్పును వెలువరించింది. అయితే ఆ తీర్పు ఈ ఒక్క కేసు విషయంలోనే కాక అన్నిసందర్భాల్లోనూ వర్తిస్తుందని ముంబయి హైకోర్టు స్ఫష్టం చేసింది.
ముంబయికి చెందిన 49 ఏళ్ల పోలీసు ఇన్ స్పెక్టర్ కు 1996లో వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే భార్యభర్తల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. దీంతో ఇరువురు కోర్టుకెక్కి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్న తరువాత కూడా తన మాజీ భార్య తన పేరుని వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని, తన ఇంటి పేరును కూడా వాడుకుంటోందంటూ ఆయన మళ్లీ కోర్టుకెక్కారు. తన లాయర్లు రమేష్, సాధనా లల్వానీల ద్వారా ముంబయి ఫ్యామిలీ కోర్టుకెక్కాడు. మాజీ భార్య తన ఇంటి పేరును వాడుకోవడం ద్వారా తన కుటుంబానకి, భర్తగా తన పేరు వాడుకుంటూ జనాలను మోసం చేస్తోన్న వైనాన్ని స్థానిక పత్రికలు ప్రచురించిన కథానాలను ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టారు.
వీటిని విచారించిన ముంబయి ఫ్యామిలీ కోర్టు విడాకులు తీసుకున్న తరువాత మాజీభర్త పేరును గానీ, ఆయన ఇంటిపేరును గానీ వాడుకునే హక్కు సదరు మాజీ భార్యకు ఉండదని స్ఫష్టం చేసారు. ఈ తీర్పుపై మాజీ బార్య ముంబయి హైకోర్టును ఆశ్రయించి సవాల్ చేసింది. ఆమె తరుపు న్యాయవాది మిలిన్ జాదవ్ హైకోర్టులో తన వాదనను వినిపించారు. దీనిని విచారించిన హైకోర్టు గతంలో ప్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 'విడాకులు తీసుకున్న తరువాత వివాహం బంధం తెగిపోయినట్లే. అలాంటప్పుడు మాజీ భర్త పేరును వాడుకోవడం సరికాదు' అని కోర్టు వ్యాఖ్యానించింది. కనీసం బ్యాంక్ అకౌంట్లలో కూడా వాడుకునే వీలు లేదని ఆదేశాల్లో పేర్కొంది.
News Posted: 19 February, 2010
|