'ఆంక్షల' పరీక్షలు బెంగళూరు : సెల్ ఫోన్ లలో సిల్లీ కబుర్లు లేవు... టీవీలు షోలు చూసే ఛాన్స్ లేదు... కంప్యూటర్స్ లో వీడియో గేమ్ ఆడే అవకాశం అంతకన్నా లేదు. విద్యార్థులకు నిత్య కాలక్షేపంగా మారిన ఈ సౌకర్యాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోవడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..! మరేం లేదు. పరీక్షల సీజన్ వచ్చేసింది. పరీక్షలు దగ్గరకు వచ్చేస్తుండడంతో యువత అమితంగా ఇష్టపడే ఈ ఆధునిక పరికరాలన్నింటినీ తల్లిదండ్రులు అటుకెక్కించేశారు. వచ్చే నెల నుండి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వినోదాత్మక పరికరాలకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. పరీక్షల కారణంగా విద్యార్థులున్న ప్రతీ ఇంట్లోనూ తల్లిదండ్రులు ఆంక్షలు విధించారు. టీవీలు, కంప్యూటర్లు, సెల్ పోన్ లను పరీక్షలు పూర్తయ్యే వరకు వినియోగించరాదని నిబంధన విధించారు. తమ పిల్లలు సెల్ ఫోన్లలో మాట్లాడుతూ, టీవీలు చూస్తూ, కంప్యూటర్లలో గేమ్ లు ఆడుతూ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే విలువైన పరీక్షా సమయం వృథా అవుతుందన్నదే తల్లిదండ్రుల భయం. పరీక్షలు ముగిసే వరకు వినోదాలకు టాటా చెప్పాల్సిందే అని తమ బిడ్డలను ఆదేశిస్తున్నారు. అంతేగాక విద్యార్థుల సినిమాలు, షికార్లుకు కూడా బ్రేక్ వేశారు.
పరీక్షల కాలంలో తమ బిడ్డలకు చదువుల్లో ఏకాగ్రతకు దెబ్బతినకుండా బాహ్య ప్రపంచంతో సంబంధాలకు దూరం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ ఆనందంగా చూసే టీవీ కార్యక్రమాల కేబుల్ కనెక్షన్ ను కట్ చేస్తున్నారు. తమ పిల్లల సెల్ ఫోన్ లను రీచార్జి చేయించకుండా జీరో బ్యాలన్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ జోలికి వారు పోకుండా కంప్యూటర్ పాస్ వర్డ్ మార్చడం లేదా నెట్ కనెక్షన్ తొలగిస్తున్నారు. ' మా అబ్బాయి గంటల తరబడి సెల్ ఫోన్ మాట్లడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావంటే సబ్జెక్టు గురించి చర్చిస్తున్నా అని చెబుతున్నాడు. అందుకే పరీక్షలయ్యే వరకు సెల్ ఫోన్ ను అందుబాటులో లేకుండాచేశాను' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ విద్యార్థి తండ్రి చెప్పారు. పరీక్షల సీజన్ కారణంగా కొన్నికుటుంబాలు తమ ఇళ్లకు బంధువులను కూడా రావద్దని నిర్మొహమాటంగా చెబుతున్నాయి. 'పరీక్షలు ముగిసే వరకు మేం విందు వినోదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఈ టైమ్ లో మా ఇంటికి బంధువులు కూడా రాకుండా జాగ్రత్తపడ్డాం' అని ఓ విద్యార్థి తండ్రి వినోద్ చెప్పారు.
News Posted: 19 February, 2010
|