'బిచ్చగాళ్ళను పట్టుకెళ్ళండి' న్యూఢిల్లీ : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్న చందనా తయారైంది ఢిల్లీలో బిచ్చగాళ్ళ పరిస్థితి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కామన్వెల్త్ గేమ్స్ కు బిచ్చగాళ్ల బెడదను వదిలించుకోవాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలా సాధ్యమా అని తలలు పగలు కొట్టుకున్న తలపండిన అధికారులకు తరుణోపాయం లభించింది. అదేమిటంటే ఢిల్లీలో యాచక వృత్తిని స్వీకరించిన వారిలో చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే కాబట్టి, వారిని తిరిగి తీసుకెళ్ళవలసిందిగా ఆయా రాష్ట్రాలను కోరింది. ఈమేరకు పది రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే లేఖలు రాసింది.
'లేఖలు పంపించామని, క్రీడలు మొదలయ్యే నాటికి పని పూర్తయ్యే అవకాశం ఉంద'ని ఢిల్లీ ప్రభుత్వ సాంఘక సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్ పరీదా చెప్పారు. ఢిల్లీలో యాచకులకు సంబంధించిన సమగ్రమైన సమాచారం లేనప్పటికీ 2009లో శాంపిల్ సర్వే చేశామని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం యాచకుల కోసం నిర్వహిస్తున్న 11 వసతిగృహాల్లో 2018 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ భాగం బీహార్, ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన వారేనని ఆయన వివరించారు. అలానే ఢిల్లీ పోలీసు యాంటీ బెగ్గింగ్ స్క్వాడ్ 1518 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో 1099 మంది ఢిల్లీయేతరులేనని తేలిందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 12 వ తేదీన లేఖలు రాశామని, ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించిందని ఆయన తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన యాచకులకు సంబంధించి సమాచారం పంపాల్సిందిగా ఆ ప్రభుత్వం కోరిందని చెప్పారు. అన్ని ప్రభుత్వాల నుంచి సమాధానం వస్తే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
'ఢిల్లీలోనే తమకు మంచి అవకాశాలు ఉన్నాయని' చాలా మంది యాచకులు చెబుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రెండు రోజులు అడుక్కుంటే వారానికి సరిపడా సంపాదన వస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ సంగతిని తెలుసుకున్న ఢిల్లీ యాచకులు మాత్రం ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. తమ రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలని వారు ప్రశ్నిస్తున్నారు. తాము అనేక సంవత్సరాలు ఇక్కడే బతుకుతున్నామని, సొంత ఊరు వెళితే తాగడానకి నీళ్లు కూడా దొరకవని జోథ్ పూర్ కు చెందిన సుశీల అనే యాచకురాలు చెప్పింది. ఈమే టాల్ స్టాయ్ మార్గ- జనపథ్ రోడ్ల కూడలిలో అడుక్కుంటూ ఉంటుంది.
News Posted: 20 February, 2010
|