ఇండియాకు ఒబామా వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఇండియాను 'సందర్శించవచ్చు'నని, ఆయన ఇండియాను అమెరికాకు 'వదలుకోలేని' భాగస్వామిగా పరిగణిస్తుంటారని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా విభాగం సహాయ కార్యదర్శి రాబర్ట్ బ్లేక్ చెప్పారు. ఒబామా ప్రభుత్వ అజెండాలో ఇండియాదే అగ్ర స్థానమని, గత సంవత్సరం నవంబర్ లో మొదటి అధికార పర్యటనకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను అధ్యక్షుడు ఆహ్వానించడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ఆయన చెప్పారు. 'ఇండియాను తాను తిరిగి సందర్శించగలనని వాగ్దానం చేయడం ద్వారా ఇండియాకు అమెరికా ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నదో ఒబామా నొక్చి చెప్పారు. అది బహుశా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో జరగవచ్చు' అని బ్లేక్ ప్రపంచ వ్యవహారాల షికాగో మండలి సమావేశంలో ప్రసంగించిన సందర్భంలో పేర్కొన్నారు. అయితే, ఈ పర్యటనకు తేదీలను ఆయన ప్రకటించలేదు.
యుఎస్ కు వదలుకోలేని భాగస్వామిగా ఇండియాను యుఎస్ అధ్యక్షుడు పరిగణిస్తున్నట్లు బ్లేక్ సభికులకు గుర్తు చేశారు. 'యునైటెడ్ స్టేట్స్, ఇండియా మధ్య భాగస్వామ్యానికి మించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంబంధాలు మన ఉమ్మడి భవితవ్యానికి కీలకం అవుతుంటాయి' అని బ్లేక్ పేర్కొన్నారు. 'మనం ఎల్లప్పుడూ ఏకీభవిస్తుంటామని దానికి అర్థం కాదు. ఎందుకంటే అలా చేయం. కాని, ఇప్పటికే ఏర్పాటైన బలమైన పునాదిపై ఉభయ దేశాలకే కాకుండా తక్కిన అంతర్జాతీయ సమాజానికి కూడా ప్రయోజనకరమైన దృఢమైన భాగస్వామ్యాన్ని మనం నిర్మించుకోవచ్చు' అని ఆయన అన్నారు. 'అమెరికా, ఇండియా మధ్య ఆదర్శాలు, లక్ష్యాలలో సారూప్యత ఉంది. పరస్పర ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలలో ఇది ప్రతిబింబిస్తుంటుంది' అని బ్లేక్ చెప్పారు.
ఇండియా, పాకిస్తాన్, యుఎస్ మూడు దేశాలూ ఉమ్మడిగా ఉగ్రవాదం బెడదను ఎదుర్కొంటున్నాయని బ్లేక్ చెబుతూ, 'ఇండియా, పాకిస్తాన్ మధ్య సుస్థిర సంబంధాలు నెలకొనాలన్నది మన ఆకాంక్ష కాగా, అవి తగిన సమయంలో తమ షరతుల ప్రకారం అటువంటి సంబంధాలు నెలకొల్పుకుంటాయి' అని సూచించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి సాయం చేస్తున్న ఐదు అగ్ర శ్రేణి దేశాలలో ఇండియా స్థానం విలువైనదని ఆయన పేర్కొన్నారు.
యుద్ధంతో సంక్షుభితమైన ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి పార్లమెంట్ భవనం, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల పరంగాను, ఇరవై లక్షల మంది బడిపిల్లలకు ఆహార సరఫరా వంటి మానవతావాద సహాయ కార్యక్రమాల పరంగాను న్యూఢిల్లీ అందజేస్తున్న తోడ్పాటు విలువైనదని బ్లేక్ కొనియాడారు. ఆఫ్ఘనిస్తాన్ కు 1.2 బిలియన్ డాలర్ల మేరకు సాయం అందజేయగలమని ఇండియా వాగ్దానం చేసినట్లు బ్లేక్ తెలియజేశారు.
News Posted: 20 February, 2010
|