ఎంఎఫ్ కు అరుదైన ఆదరణ
ముంబై : బహుళ ఖ్యాతిని ఆర్జించిన భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ కు ఖతార్ దేశం తమ దేశ పౌరసత్వం ప్రదానం చేసింది. ఖతార్ ఇలా చేయడం చాలా అరుదు. హుస్సేన్ బుధవారం తెల్లవారు జామున దుబాయి నుంచి 'ది హిందూ' ప్రధాన సంపాదకుడు ఎన్. రామ్ కు ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశారు. తాను గీసిన ఒక రేఖా చిత్రంపై ఈ మేరకు రాసిన కొన్ని వాక్యాలను ఆయన రామ్ కు చదివి వినిపించారు. హుస్సేన్ ఈ రేఖా చిత్రాన్ని ఆ పత్రికకు పంపారు కూడా.
'ఖతార్ తమ పౌరసత్వంతో గౌరవించింది' అని హుస్సేన్ చెప్పుకున్నారు. కాని తాను ఇలా ప్రవాస జీవితం గడపవలసి రావడం పట్ల, తన జన్మస్థలం పౌరసత్వాన్ని వదలుకోవలసి వస్తుండడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా గడచిన తన కళా జీవితంలో ఆయన తరగని దేశాభిమానాన్ని ప్రదర్శించారు. 'ప్రవాస భారతీయ పౌరుడు' (ఒఐసి) అనే తరగతిని కొత్తగా సృష్టించినప్పటికీ భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. తగిన లాంఛనాలను పూర్తి చేసిన తరువాత ఒఐసి ప్రతిపత్తిని హుస్సేన్ కోరతారనడంలో సందేహం ఏమాత్రం లేదు.
కాగా, ఖతార్ పౌరసత్వం కోసం హుస్సేన్ దరఖాస్తు చేయకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. సనాతన సంప్రదాయాల నుంచి మళ్లుతూ ఆధునిక పంథాను అనుసరిస్తున్న ఖతార్ పాలక కుటుంబం ప్రేరణపై ఆయనకు ఈ పౌరసత్వం మంజూరైంది. 2006లో కొన్ని హిందుత్వ శక్తులు తనపై ద్వేషపూరిత ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి హుస్సేన్ దుబాయిలో నివసిస్తున్నారు. అయితే వేసవిలో మాత్రం ఆయన లండన్ లో కాలం గడుపుతుంటారు. ఆయన ఇండియాకు తప్ప ఇతర దేశాలకు స్వేచ్ఛగా వెళుతున్నారు. దాదాపు 95 సంవత్సరాల వయస్సు ఉన్న హుస్సేన్ ఇప్పుడు రోజులో ఎక్కువ సేపు భారీ కాన్వాస్ చిత్రాలను, నిలువెత్తు గాజు శిల్పాలను రూపొందిస్తుంటారు.
News Posted: 25 February, 2010
|