'మాయమైన' సజ్జన్ న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసు సందర్భంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్ బిడబ్ల్యు) జారీ అయిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ 'జాడ' గడచిన వారం రోజులుగా 'తెలియడం లేదు'. జనవరి 13నే ఎన్ బిడబ్ల్యు జారీ అయినప్పటికీ కేంద్ర నేరపరిశోధక సంస్థ (సిబిఐ) సజ్జన్ ను అరెస్టు చేయలేకపోయింది.
సజ్జన్ వ్యక్తిగత భద్రత అధికారి (పిఎస్ఒ), ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రామ్ నిరోహాను ఈ సందర్భంగా సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు, జడ్ ప్లస్ కేటగరీ భద్రత ఉన్న సజ్జన్ కు పిఎస్ఒగా నియుక్తుడైన నిరోహా ఈ నెల 19న భద్రతా విభాగానికి సజ్జన్ అదృశ్యమైనట్లు తెలియజేశారు.
భద్రతా విభాగంలో పోస్టింగ్ అయిన నిరోహాను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసినట్లు, అతని మాటలు ఎంత నిజమో నిర్థారించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా, పోలీసులు మాదీపూర్ లో సజ్జన్ కుమార్ నివాసం వెలుపల ఒక గస్తీ వ్యానును నిలిపి ఉంచారు. సజ్జన్ సోదరుడు రమేష్ కుమార్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు.
'అరెస్టును తప్పించుకోవడానికి సజ్జన్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుంది' అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి సజ్జన్ మీడియాకు అందుబాటులో లేకపోయారు. అయితే, సజ్జన్ చట్టానికి దూరంగా పారిపోవడం లేదని, ఒక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా చట్టబద్ధమైన అన్ని అవకాశాలను ఆయన అన్వేషిస్తున్నారని ఆయన న్యాయవాది ఇంతకుముందు కోర్టుకు తెలిపారు.
సజ్జన్ ఎక్కడ ఉన్నదీ తెలియనందున తాము ఆయనను అరెస్టు చేయలేకపోయామని సిబిఐ ఈ నెల 23న కోర్టుకు నివేదించింది. దీనితో ఆయనను 'పట్టుకోవాలనే శ్రద్ధ లేనందుకు' సిబిఐని న్యాయమూర్తి తప్పు పట్టారు.
News Posted: 25 February, 2010
|