లండన్ : పరిగెత్తే వరకే కారు జోరు చెల్లు.. కుంటు పడిందంటే అది ఇనపకొట్టుకెళ్ళు..అని మన తెలుగోళ్ళకు సినిమా కవి ఎప్పుడో చెప్పాడు. ఈ సంగతి మరి ఇంగ్లండ్ రాణీ గారికి తెలిసినట్లు లేదు. పాపం చివరకు ఆమె పోలీసు కారులో రాణీ వాసానికి చేరవలసి వచ్చింది. ఘనత వహించిన బ్రిటీషు రాణీ గారి పరువు పోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే ... ఇంగ్లండ్ రాణి రెండవ ఎలిజబెత్ కు తన బెంట్లీ కారు నమ్ముకోదగినదిగా కనిపించడం లేదు. లండన్ లో రాణి పర్యటిస్తున్నప్పుడు మధ్యలో ఆమె కారు ఇక ముందుకు సాగలేనంటూ మొరాయించింది. రాణి ఆల్డ్ గేట్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఆమె అధికారిక కారు ఇంజన్ స్టార్ట్ కాలేదు. ఫలితంగా ఆమె ఒక పోలీస్ అధికారి కారులో ప్రయాణించవలసి వచ్చింది.
'ఇది ఇబ్బందికర పరిస్థితే. కారు మొరాయించడం చూసి రాణి దిగ్భ్రాంతి చెందినట్లు కనిపించింది. ఆమె కారులో నుంచి బయటకు వచ్చారు. ఒక పోలీస్ రేంజ్ ఓవర్ లో ఆమె వెళ్లబోతున్నట్లు సహాయక అధికారి ఒకరు సూచించారు. ఆమె ఆ కారు ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగించారు' అని పాదచారి ఒకరు చెప్పినట్లు 'ది టెలిగ్రాఫ్' పత్రిక తెలియజేసింది.
'రాణి పర్యటన సమయంలో ఆమె బెంట్లీ కారు ఇబ్బంది పెట్టింది. తన కారు వెనుక వస్తున్న పోలీస్ రేంజ్ ఓవర్ ను రాణి ఎక్కారు' అని బకింగ్ హామ్ ప్యాలెస్ అధికార ప్రతినిధి ఒకరు వివరించారు.