సైంటిస్టు అదృశ్యం చెన్నై : దేశంలో ఒక అణు విద్యుత్ కేంద్రం నుంచి సైంటిఫిక్ ఆఫీసర్ విచిత్రంగా అదృశ్యమైన మరొక ఉదంతం వెలుగు చూసింది. కల్పాక్కంలోని ఇందిరా గాంధి అణు పరిశోధన కేంద్రం (ఐజిసిఎఆర్) కంప్యూటర్ విభాగంలో సైంటిఫిక్ ఆఫీసర్ గా పని చేస్తున్న 37 సంవత్సరాల అనంత నారాయణన్ జాడ గడచిన పది రోజులుగా తెలియడం లేదని ఫిర్యాదు వచ్చింది. కర్నాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలో సైంటిస్ట్ అయిన ఎల్. మహాలింగం నిరుడు జూన్ లో అదృశ్యమయ్యారు. ఆతరువాత ఆయన మృతదేహం ఒక నదిలో దొరికింది.
తమిళనాడు పోలీసుల సమాచారం ప్రకారం, 1997లో ఐజిసిఎఆర్ లో చేరిన అనంత నారాయణన్ ఎప్పటి వలె ఫిబ్రవరి 15న ఉదయం సుమారు 8.30 గంటలకు ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరారు. కాని ఇంటికి తిరిగి రాలేదు. స్థానిక పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఐజిసిఎఆర్ అధికారుల సమాచారం ప్రకారం, తన పెద్ద కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండడం, కుటుంబ వివాదాలు కొన్ని ఆయనను కలచివేశాయి. దీనితో ఆయన ఇల్లు వదలిపోవాలని అనుకున్నారు. కాగా, పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పుదుచ్చేరి, తిరువణ్ణామలై, సేలం, చెన్నై వంటి ప్రదేశాలలోను, ఆంధ్ర ప్రదేశ్ లో కూడాను ఆయన కోసం అన్వేషిస్తున్నారు.
'ఆయన రోజూ వలె ఫిబ్రవరి 15న ఉదయం సుమారు 8.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన ఆఫీసుకు వెళుతున్నారని నేను అనుకున్నాను. ఐజిసిఎఆర్ ప్రాంగణం లోపల మొబైల్ ఫోన్లపై నిషేధం ఉన్నందున ఆయన తన మొబైల్ ఫోనును ఇంటిలోనే ఉంచారు. మామూలుగా ఇంటికి వచ్చే సమయానికి ఆయన రాకపోయేసరికి నేను ఆయన ఆఫీసుకు ఫోన్ చేశాను. ఆ రోజు ఆయన ఆఫీసుకు రాలేదని నాకు తెలియజేశారు. ఆయన వెళ్లేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలలో నేను వాకబు చేశాను. కాని ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోయాను. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారమూ లేదు' అని అనంత నారాయణన్ భార్య రుక్మిణి గురువారం చెప్పారు.
News Posted: 26 February, 2010
|