కసబ్ 'సెల్'కు 5 కోట్లు ముంబై : ముంబై దాడుల నిందితుల్లో పట్టుబడిన ఏకైక నిందితుడు అబ్దుల్ అమీర్ కసబ్ ను నిర్బంధించడం కోసం ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక భద్రత సెల్ నిర్మాణానికి మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ (పిడబ్ల్యుడి) భారీగా 5.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కసబ్ పై ఎటువంటి దాడి లేదా విధ్వంసకాండ జరగకుండా జాగ్రత్త పడేందుకు కోడిగుడ్డు ఆకారంలో అత్యంత భద్రతతో ఈ సెల్ నిర్మించారు.'అండా' సెల్ గా పేర్కొంటున్న ఈ సెల్ లో కసబ్ ను ఒక్కడినే నిర్బంధంలో ఉంచారు. ఈ సెల్ కు అత్యంత దృఢమైన ఉక్కు గోడ ఉన్నది.
దేశంలో ఒక నిందితుడిని నిర్బంధించడానికై నిర్మించిన అత్యంత ఖరీదైన సెల్స్ లో ఇది ఒకటని రాష్ట్ర హోమ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు అంగీకరించారు. సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టం కింద జుహూ వాసి యోగాచార్య ఆనంద్ జీ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలియజేశారు. కసబ్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత సమకూర్చవలసిన అవససం ఉందని యోగాచార్య ఆనంద్ జీ అంగీకరిస్తూనే, సెల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. రూ. 5 కోట్ల ఖర్చు కేవలం కొసరు వంటిదని ఆయన పేర్కొన్నారు. 'లాయర్ల ఫీజు, భద్రత దళాలు కల్పిస్తున్న రక్షణ వ్యయం, న్యాయ ప్రక్రియలో జరిగే ఆలస్యాలకు మూల్యం ఇందులో చేరలేదు' అని ఆయన పేర్కొన్నారు.
ముంబై దాడి మృతుల భార్యలతో మాట్లాడినప్పుడు కసబ్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించడం అవసరమేనని అంగీకరించారు. అయితే, 'అండా' సెల్ నిర్మాణానికి డబ్బును ఖర్చు చేసిన విధంపై సరైన ఆడిట్ జరిపించవలసిన అవసరం ఉందని వారు సూచించారు.
News Posted: 26 February, 2010
|