రన్ వే పై నగ్నంగా... న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధి అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి నగ్నంగా రన్ వే సమీపంలో నగ్నంగా పడుకున్న కారణంగా ఒక విమానం కిందకు దిగడానికి అంతరాయం కలిగింది.ఆ వ్యక్తిని బీహార్ కు చెందిన 33 సంవత్సరాల అరుణ్ రాయ్ గా గుర్తించారు. ఈ సంఘటన సమయంలో అతను మద్యం నిషాలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఐజిఐ విమానాశ్రయంలో రన్ వే నంబర్ 29కి నేరుగా దారి తీసే సమ్లాకా టాక్సీవే వద్ద అతను నేలపై నగ్నంగా పడుకున్నట్లు తెలుస్తున్నది.
గ్రౌండ్ రాడార్ పై అస్పష్టతను గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఎటిసి) ఒక పరిశీలక బృందాన్ని పంపారు. రన్ వే మధ్యలో పడుకుని ఉన్న తాగుబోతును వారు చూశారు. దాదాపు రెండు నిమిషాలలో కిందకు దిగవలసి ఉన్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానం 'ఐటి 803' కింద అతను నలిగిపోయి ఉండేవాడే. కాగా, ఈ సంఘటన కారణంగా మరి రెండు విమానాలు కిందకు దిగడానికి నిరీక్షించవలసి వచ్చింది.
అతను విమానాశ్రయం ప్రహరీ గోడ దూకి, రన్ వేని చేరుకుని ఉండవచ్చునని విమానాశ్రయం అధికారులు అన్నారు. శుక్రవారం రాత్రి సుమారు 7.55 గంటలకు భద్రతాపరమైన ఈ అతిక్రమణ అధికారుల దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తిని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బందికి అప్పగించారు. ఢిల్లీ పోలీసులు అతనిని ప్రశ్నించవలసి ఉంది.
News Posted: 27 February, 2010
|