కూతురు లేఖకు ప్రణబ్ నో! న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంట్ కు సమర్పించిన 2010 - 11 బడ్జెట్ లో గణనీయంగా పన్ను వడ్డనలు వేసినా కొందరికి పన్ను రాయితీలు ప్రకటించారు. ఆదాయం పన్ను శ్లాబ్ లు పెంచారు. అయితే, తన కుమార్తె శర్మిష్ట కోర్కెలను మాత్రం ఆయన నెరవేర్చలేదు. కళాకారులకు ఆదాయం పన్ను (ఐటి) చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించాలని తన తండ్రికి విజ్ఞప్తి చేస్తూ శర్మిష్ట ఒక బహిరంగ లేఖ రాశారు. స్వయంగా కథక్ నర్తకి అయిన శర్మిష్ట కళాకారులకు ఐటి రాయితీ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇంటిలో ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదనే కారణంతో ఆమె తన తండ్రికి ఈ విధంగా బహిరంగ లేఖ రాశారు. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రతిపాదనలలో కళాకారులకు ఐటి చెల్లించకుండా మినహాయింపు కల్పించక పోవడం బట్టి ఆయన తన కుమార్తె అభ్యర్థనను బేఖాతరు చేశారని అనుకోవాలి.
News Posted: 27 February, 2010
|