కేసిఆర్ రాజీనామా చేయరా? హైదరాబాద్ : తెలంగాణ కోసం పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, తాను మాత్రం ఇప్పట్లో రాజీనామా చేయకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఎంపీ పదవిని వదులుకునేందుకు వెనుకంజ వేస్తున్న కేసిఆర్ ను చూసి పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. మెదక్ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ విజయశాంతి రాజీనామా చేయకూడదని నిర్ణయించుకున్నందువల్లే కేసీఆర్ తన రాజీనామాకు వెనుకంజ వేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె రాజీనామా చేయకుండా తానొక్క డినే చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా పార్టీపై నియంత్రణ లేదన్న విమర్శలు వస్తాయన్న భయంతోనే కేసీఆర్ తన రాజీనామాను గురించి మాట్లాడటం లేదని అంటున్నారు.
మహబూబ్‌నగర్‌లోని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలు టీడీపీ స్వాధీనంలో ఉండటం, కాంగ్రెస్ మాజీ ఎంపీ విఠల్‌రావు కూడా మళ్లీ పోటీకి సిద్ధంగా ఉండటం వల్లే కేసీఆర్ ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. ఉప ఎన్నికలు జరిగితే రాజకీయ వాతావరణం ఏర్పడిన ఫలితంగా తెలంగాణ వాదం మరుగున పడి క్యాడర్ బలం ఆధారంగా ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమవుతుందన్న వాదన ఉంది.
రాజీనామా చేయకుండా నాన్చుతున్న కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి కనిపిస్తోంది. ‘ఇప్పటివరకూ రాజీనామా ఆమోదించుకోని వ్యవహారం కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా చేస్తోంది. అందరితో రాజీనామాలు చేయించి, తాను మాత్రం సేఫ్‌గా ఉండి పదవిని కాపాడుకుంటున్నారన్న సంకేతాలు వెళ్లడం మంచిదికాదు. అందరినీ బలి చేసి, తాను మాత్రం సురక్షితంగా ఉన్నారన్న ప్రచారం పార్టీకీ మంచిది కాద’ని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.
News Posted: 28 February, 2010
|