ధోనీతో చరణ్ యాక్టింగ్ హైదరాబాద్: యువతుల హృదయాలనే కాదు, జనం మదిని దోచుకుంటున్న ఓ ఇద్దరు యువకులు తియ్యని పానీయాన్ని పంచుకున్నారు. అదేనండి కూల్ డ్రింక్ ప్రచారం కోసం తీసిన టెలివిజన్ ప్రకటనలో ఇద్దరూ కలిసి నటించారు. ప్రచార ప్రకటనల రంగంలో సంచలనం సృష్టించారు. కోలా ప్రచార ప్రకటనలో సెక్సీయస్ట్ బాలీవుడ్ భామామణి దీపికా పదుకొనేతో బుల్లి తెరను పంచుకున్న టాలీవుడ్ పిడుగు, యంగ్ హాటెస్ట్ నటుడు రామ్ చరణ్ తేజ తాజాగా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి కూల్ డ్రింక్ యాడ్ లో నటించాడు. టెలివిజన్ ప్రచార ప్రకటనల రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెబుతున్న ఈ యాడ్ షూటింగ్ ఇటీవల ముంబయిలో మూడు రోజుల పాటు జరిగింది. దీనిలో మరో విశేషం ఏమిటంటే చతుర సంభాషణల రచయితగా పాపులర్ అయి, దర్శకత్వం చేపట్టి తెలుగులో హిట్ ల మీద హిట్ లు కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్ దర్శకుడు. అరవై సెకన్ల పాటు టివీల్లో కనిపించే ఈ యాడ్ ను ముందు చెర్రీ (అదేనండి రామ్ చరణ్ తేజ ముద్దు పేరు), ధోనీ తో విడివిడిగా తీసి, ఆ తరువాత కొన్ని షాట్లను ఇద్దరిపై కలిపి తీశారని తెలిసింది.
మహీ, చెర్రీ షూటింగ్ సందర్భంగా చాలా సరదాగా గడిపారని, యాడ్ చక్కగా వచ్చిందని చెబుతున్నారు. ఈ ఇద్దరు హాట్ ఫేవరేట్లకూ అభిరుచులు కూడా కలిసాయట. చెర్రీ క్రికెట్ తెగ చూసేవాడట. కానీ మధ్యలో మానేశాడట. అయితే మహీ కెప్టెన్సీ తీసుకున్న తరువాత చెర్రీ మళ్ళీ క్రికెట్ ప్రేమికుడు అయిపోయాడట. అలానే మహీకి కూడా తెలుగు సినిమాలు గురించి తెలుసని, చెర్రీ వివరాలను ముందే తెలుసుకున్నాడని చెబుతున్నారు. మహీతో కలిసి నటించడం, అతనితో మాట్లాడటం చక్కని అనుభూతని చెర్రీ చెప్పాడు. త్రివిక్రమ్ యాడ్ ను చాలా బాగా తీశాడని కూడా వివరించాడు.
News Posted: 1 March, 2010
|