ఐపిఎస్ లకు కొత్త చాయిస్ న్యూఢిల్లీ : కొత్త ఐపీఎస్ లకు అరుదైన ఛాన్స్ వచ్చింది. ఐపీఎస్ శిక్షణ పూర్తయిన వెంటనే ఇక నేరుగా కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆవకాశం రానుంది. కేంద్ర ఇంటెలిజెన్స్, సీబీఐ విభాగాల్లో కొత్త ఐపీఎస్ లు నేరుగా చేరే విధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఐపీఎస్ పూర్తి చేసిన అధికారులను వివిధ రాష్ట్రా క్యాడర్లకు కేటాయిస్తున్నారు. ఈ అధికారులు కేంద్ర సర్వీసుల్లో చేరాలంటే డిప్యూటేషన్ పై మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో వీరు వేరుగా చేరే అవకాశం లేదు. అయితే ఇకపై ఐపీఎస్ లు డిప్యూటేషన్ పై కాకుండా నేరుగా కేంద్ర సర్వీసులను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని హోంమంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దేశ భద్రతలో కీలకంగా వ్యవహరించే ఈ విభాగాల్లో అధికారుల కొరత భారీగా ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వీసులో ఇప్పటివరకు 4000 వరకు అధికారుల కొరత ఉన్నట్లు హోంశాఖే చెబుతోంది. ఈ నేపధ్యంలో లోటును భర్తే చేసేందుకు కేంద్ర సర్వీసులను ఎంపిక చేసుకునే అవకాశంతో కల్పించడంతో పాటుగా, తప్పనిసరి కూడా చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.
ప్రతీ ఐపీఎస్ అధికారి తన సర్వీసులో ఒకసారైనా సీఆర్పీఎఫ్, బిఎస్ ఎఫ్, ఐటీబీపీ, ఎస్ ఎస్ బి, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐబీ వంటి విభాగాల్లో పని చేసేలా చూడాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అయితే నిర్ణీత సమయం ముగిసిన తరువాత ఐపీఎస్ లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లే వీలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ విధానం ద్వరా కేంద్ర భద్రతా విబాగాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు వివరించారు.
News Posted: 1 March, 2010
|