పెళ్ళి ఊరేగింపులు కట్! కటక్ : స్వతంత్ర దేశంలో ప్రతీ దానికీ ఊరేగింపే. ఏదో భూస్వామ్య వ్యవస్థలో ధనవంతుల ఇళ్ళళ్ళో పెళ్ళిళ్లు జరిగితే గొప్పకోసం ఊరంతా ఊరేగించేవారు. ఇప్పటికీ మన దేశంలో పెళ్ళి ఊరేగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. రద్దీ రోడ్లపై కూడా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ లక్షలాది మందిని ఇబ్బందుల పాల్జేస్తూ ఘనతను చాటుకోడానికి బడాబాబులు పెళ్ళి ఊరేగింపులు తీస్తూనే ఉన్నారు. దీనికి పోలీసుల బందోబస్తు కూడాను. ఇదిగో ఇలాంటి గొప్పవాళ్ళ చాటింపులకు కటక్ పోలీసులు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. కటక్ నగరంలో ట్రాఫిక్ జామ్ లు వంటి ఇబ్బందులను అధిగమించడానికై ప్రధాన రోడ్లపై పెళ్లి ఊరేగింపులను నిషేధించాలని పోలీస్ కమిషనరేట్ నిర్ణయించింది. 'ట్రాఫిక్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దశల వారీగా అనుసరించబోయే కార్యాచరణ ప్రణాళికలో భాగమే ప్రధాన రహదారులపై ఈ ఊరేగింపుల నిషేధం. పెళ్లి ఊరేగింపులను అనుమతించని రోడ్లను ఖరారు చేస్తున్నాం' అని పోలీస్ కమిషనర్ బి.కె. శర్మ తెలియజేశారు.
బాదంబాడి-డోలాముండై, రాణిహాట్-బక్సీబజార్, బజ్రకబటి రోడ్, జైల్ రోడ్, దర్గా బజార్, బాలూ బజార్ వంటి ప్రాంతాలపై ఈ నిషేధం విధించవచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచిస్తున్నాయి. నగరం మీదుగా సాగే జాతీయ రహదారి పొడుగునా పెళ్లి ఊరేగింపులకు లైసెన్సు మంజూరు చేయరు. ఇతర రోడ్లపై పెళ్లి ఊరేగింపులకు లైసెన్సు మంజూరు చేయడానికి కూడా కఠినమైన నిబంధనలను రూపొందిస్తున్నారు. ఊరేగింపు నిడివిని 500 మీటర్లకు పరిమితం చేశారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు. బ్యాండ్ల నుంచి కూడా 65 డెసిబెల్స్ కు మించి శబ్దం వెలువడరాదు. 'ఈ నిబంధనలను ఏదైనా ఊరేగింపులో ఉల్లంఘించినట్లు కనుగొంటే, ఎవరి పేరుమీద లైసెన్సు మంజూరైందో ఆ వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేస్తాం. ఊరేగింపును నిలువరిస్తాం' అని శర్మ హెచ్చరించారు.
ఒక పిల్ ను పురస్కరించుకుని ఒరిస్సా హైకోర్టు నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలను పర్యవేక్షిస్తున్నది. పెరుగుతున్న జనాభా, స్థలం కొరతకు తోడు కటక్ రోడ్లపై వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఈ 'రజత నగరం' లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయిందని పిల్ లో ఆరోపించారు. కటక్ లో ట్రాఫిక్ వ్యవస్థ పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై పోలీస్ కమిషనరేట్ కు హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
News Posted: 2 March, 2010
|