ఇక బ్రెస్ట్ బాంబులు వాషింగ్టన్ : మహిళలు సౌందర్యం కోసం స్తన సౌష్టవానికి చేయించుకునే శస్త్ర చికిత్సలు తీవ్రవాదులకు ఉపయోగపడవచ్చని బ్రిటీషు నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. తీవ్రవాదుల నుంచి అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఇంటిలిజెన్స్ నిపుణులకు ఇలాంటి ధృవీకరణలు దొరికినట్లు చెబుతున్నారు. స్తనాలు పెద్దవిగా కనిపించడానికి చేయించుకునే ఇంప్లాంట్ సర్జరీలో వినియోగించే సెలైన్, జెల్ కు బదులుగా పేలుడు పదార్ధాలు, బాంబులు అమర్చుకోవచ్చని, ఆలాంటి మహిళలు మానవ బాంబులుగా విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
బ్రెస్ట్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలో ఎలాంటి ద్రవపదార్ధాన్నైనా అమర్చవచ్చని, జెల్ ఇంప్లాంట్ అయితే తిరిగి బ్రెస్ట్ ను తెరచి, మరో విధమైన జెల్ ను మార్చుకోవచ్చని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ క్రైగ్ పెర్సన్ వివరించారు. స్తనాల్లో శస్త్ర చికిత్స ద్వారా అమర్చిన ద్రవ పదార్ధం లేదా సిలికాన్ రకానికి చెందిన జెల్ లను బాడీ స్కానర్ ద్వారా కనుగొనడం కష్టమని ఆయన పేర్కొన్నారు.
తీవ్రవాద నిపుణులైన బెర్గ్ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ లారీ జాన్సన్ మాట్లాడుతూ ఇలాంటి ముప్పులను కనిపెట్టే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అంగీకరించారు. ప్రయాణీకులు ఇలాంటి పద్దతుల్లో తీసుకెళ్ళే పేలుడు పదార్ధాలను గుర్తించగలిగే పరికరాలు తనిఖీ పాయింట్లలో లేవని అన్నారు. ఆల్ కాయిదా తీవ్రవాదులు పేలుడు పదార్ధాల రూపకల్పనలో, వాటిని వినియోగించడంలో నిపుణులని ఆయన చెప్పారు.
News Posted: 3 March, 2010
|