పార్లమెంట్ కు రక్షణ గొడుగు న్యూఢిల్లీ : గగన దాడుల నుంచి పార్లమెంట్ భవనానికి రక్షణ కల్పించేందుకు ఒక ఎలక్ట్రానిక్ అంబ్రెల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. 2001 డిసెంబర్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం నాలుగు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ పార్లమెంట్ భవనం పైకి ఆకాశంలో నుంచి దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ భద్రతకు సంబంధించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎలక్ట్రానిక్ అంబ్రెల్లాకు సంబంధించిన ప్రతిపాదనపై వచ్చే వారం చర్చించవచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచించాయి.
ఈ విషయమై గణనీయ స్థాయిలో ప్రాథమిక పనులు జరిగాయి. పార్లమెంట్ భవనం పైకప్పు మీద ఒక రాడార్ ను అమర్చాలన్న ప్రతిపాదనపై పది మంది సభ్యుల బృందం చర్చించనున్నది. ఈ రాడార్ ను భారత వైమానిక దళం (ఐఎఎఫ్) నిర్వహిస్తుంది. ఆకాశంలో నుంచి దాడులను ఎదుర్కొనడానికి ఏర్పాటు చేయనున్న వ్యవస్థలో రాడార్ ఒక భాగం.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సారథ్యంలోని కమిటీ ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ, ప్లాన్లను అప్ గ్రేడ్ చేస్తుంటుంది. కమిటీ సభ్యులు భద్రతకు సంబంధించి అత్యాధునిక టెక్నాలజీని కొనుగోలు చేయడానికై వివిధ దేశాలను సందర్శించింది. (పార్లమెంట్ పై దాడి అనంతరం పూర్వపు ఎన్ డిఎ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.) పార్లమెంట్ భవనం చుట్టూ రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం న్యూజిలాండ్ కు చెందిన గలాఘర్ గ్రూప్ ను కమిటీ ఎంపిక చేసింది.
ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థ ప్రతి 1.2 సెకన్లకు కంచె చుట్టూ తరంగాలను పంపుతూ ఉంటుంది. కంచెను 30 జోన్లుగా విభజిస్తారు. ప్రతి జోన్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తుంటారు. కంచెను తాకే ఆగంతకులు దుర్భరమైన కుదుపునకు లోనవుతారు. అలారమ్ వ్యవస్థ పని చేయనారంభిస్తుంది. అటువంటి స్పందన వచ్చిన ప్రదేశం ఒక సెంట్రల్ కంట్రోల్ కంప్యూటర్ పై దృశ్యమానమవుతుంది.ఈ కంప్యూటర్ ను 24 గంటలూ పర్యవేక్షిస్తుంటారు. ఈ వ్యవస్థ వల్ల నేలపై నుంచి దాడి అసాధ్యం అవుతుంది. ఆకాశంలో నుంచి దాడి జరిగే ప్రమాదంపై కమిటీ ఇప్పుడు దృష్టి సారించింది. కమిటీలో చైర్మన్ కరియా ముండాతో పాటు లోక్ సభ నుంచి కీర్తి అజాద్, మీర్జా మెహబూబ్ బేబ్, పి.సి. చాకో, దారా సింగ్ చౌహాన్, జియరాజ్ సింగ్, సుశీలా సరోజ్, రాజ్యసభ నుంచి ఎస్.ఎస్. అహ్లూవాలియా, డి. రాజా, సత్యవ్రత్ చతుర్వేది సభ్యులుగా ఉన్నారు.
News Posted: 8 March, 2010
|