ఇదే అవకాశం న్యూఢిల్లీ : ముస్లిం గ్రూపులు పైకి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తుండవచ్చు. కాని తమ మహిళలు అవకాశాలు కోల్పోరాదని అవి అంతరాంతరాల్లో కోరుకుంటున్నాయి. జమాత్ ఇస్లామి-ఇ-హింద్, ముస్లిం లీగ్,అఖిల భారత ఇమామ్ ల సంఘం (ఎఐఎఐ), ముస్లిం మున్నేట్ర కళగం (ఎంఎంకె) వంటి ఈ గ్రూపులు ఈ 'మహత్తర అవకాశాన్ని' ముస్లిం మహిళలు చేజార్చుకోరాదని కోరుకుంటున్నాయి. 'మహిళల కోటాలో వెనుకబడిన తరగతులు (బిసిలు), ముస్లిం మహిళలకు కోటా ఉండాలని మామూలుగా మేము కోరుకుని ఉండేవారం. అటువంటి బిల్లు నిజంగా సాధికారత కల్పించి ఉండేది. అయితే, అదే సమయంలో ఇతర వర్గాల మహిళలతో మా మహిళలకు సమాన అవకాశాల కల్పనను తిరస్కరించాలని మేము అనుకోవడం లేదు' అని జమాత్ ఇస్లామి సంస్థకు చెందిన సిద్ధిఖ్ హసన్ చెప్పారు.
'సామాజిక విప్లవానికి మహిళా శక్తి' అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక ప్రచారోద్యమాన్ని చేపట్టాలని జమాత్ సంస్థ యోచిస్తున్నది. మరింత మంది మహిళలు రాజకీయాలలో పాలు పంచుకొనేలా ప్రోత్సహించడం తమ లక్ష్యమని జమాత్ తెలియజేసింది. కాగా, ఈ వైఖరి జమాత్ చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని తమ సభ్యులకు ఈ సంస్థ ఎమర్జన్సీ వరకు కూడా ఉద్బోధిస్తూ ఉండేది.
'50 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేసే స్థానిక సంస్థల ఎన్నికలతో వారు శ్రీకారం చుట్టాలి. ఇది మహిళలకు కొత్త ప్రపంచానికి బాటలు వేస్తుంది. మేము ఆ అవకాశాన్ని లేకుండా చేయదలచుకోవడం లేదు' అని హసన్ పేర్కొన్నారు. సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన జమాత్ మహిళలకు సీట్లు కేటాయింపులో రిజర్వేషన్ విధానాన్ని పాటించాలని అనుకుంటున్నట్లు తెలియజేసింది.
కాగా, మహిళలకు వ్యతిరేకులుగా తమకు ఉన్న అపప్రథను వదిలించుకోవడానికి ముస్లిం గ్రూపులకు ఈ బిల్లు 'చరిత్రాత్మక అవకాశాన్ని' కల్పిస్తున్నదని ఇమామ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమర్ అహ్మద్ ఇలియాసి చెప్పారు. 'ఇది గొప్ప బిల్లు. ఎందుకంటే ఇది మహిళలు పైకి రావడానికి మార్గం వేస్తున్నది' అని ఆయన పేర్కొన్నారు. ఏకైక జాతీయ ముస్లిం రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ బషీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ముస్లిం మహిళలకు కోటా ఉంటే మేమంతా ఆనందించి ఉండేవారం. కాని ఈ బిల్లు స్వాగతించదగినది. ఎందుకమటే రాజకీయాలలో విస్తృత పాత్ర పోషించేందుకు మహిళలను ఇది ప్రోత్సహిస్తుంది' అని పేర్కొన్నారు.
News Posted: 9 March, 2010
|