టీచర్ కు విముక్తి కోలకతా : పశ్చిమ బెంగాల్ బంకూరా జిల్లాలోని ఒక స్కూలులో నుంచి మార్చి 4న తుపాకితో బెదరించి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన స్కూలు ఉపాధ్యాయుడు, సిపిఐ (ఎం) నాయకుడు రంజిత్ దూలేని వారు మంగళవారం తెల్లవారు జామున పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్షేమంగా విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారు జామున సుమారు 1.15 గంటలకు గోల్తోరె, పింగ్బోని మధ్య ఒక చోట దూలేని ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
మార్చి 4న బంకూరా జిల్లా సారెంగాలోని బరూలియా మాధ్యమిక్ శిక్షా కేంద్రలో ఒక పరీక్షను పర్యవేక్షిస్తుండగా ఆ టీచర్ ను మావోయిస్టులు తుపాకితో బెదరించి తమ వెంట తీసుకుపోయారు. ఫిబ్రవరి 25న సారెంగా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి రబి లోచన్ మిత్రాను హతమార్చినందుకు అరెస్టు చేసిన తమ కేడర్ ఆరుగురిని విడుదల చేయాలని మావోయిస్టులు దూలో విడుదలకు తొలుత షరతు విధించారు.
టీచర్ ను పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో భాలూక్ బాస అడవిలోకి మావోయిస్టులు తీసుకువెళ్లారనే సమాచారం అందుకున్న తరువాత ఉమ్మడి బలగాలు ఆదివారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి మావోయిస్టులతో కాల్పుల పోరు సాగించారు. ఈ సంఘటనలో మావోయిస్ట్ కేడర్ ఒకరిని చంపారు. దీనితో పోలీస్ అత్యాచారాల వ్యతిరేక ప్రజా కమిటీ (పిసిపిఎ) తీవ్రవాదుల విభాగమైన సిధు కానొ గణ కమిటీ నాయకుడు సిధు సోరెన్ టీచర్ దూలే కుమారుని ఒక విలేకరుల గోష్ఠిని ఏర్పాటు చేసి మావోయిస్టులను, భాలూక్ బాసా అడవిలో ఎన్ కౌంటర్ సమయంలో తమను అడ్డుకున్నందుకు ఉమ్మడి బలగాలు నిర్బంధించిన 37 మంది గ్రామస్థులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయవలసిందిగా కోరారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, మావోయిస్టుల విడుదల ప్రసక్తే లేదని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) భూపీందర్ సింగ్ స్పష్టం చేశారు. 'మావోయిస్టులు ఒత్తిడికి గురవుతున్నారు. తమ డిమాండ్లను తగ్గిస్తున్నారు' అని ఆయన సోమవారం సాయంత్రం చెప్పారు.
News Posted: 9 March, 2010
|