ఎమ్మెల్యేలకు శునక భయం బెంగళూరు : బెంగళూరులో శాసనసభ్యుల క్వార్టర్ల (ఎల్ హెచ్) వద్ద భద్రతను గత కొన్ని సంవత్సరాలలో ఎంతో కట్టుదిట్టం చేసి ఉండవచ్చు. కాని ఆ ప్రాంగణంలో రాత్రిళ్ళు ఒంటరిగా నడవాలంటే భయపడిపోతున్నారు. వారి భయం దుండగుల గురించి కాదు. ఒక పిచ్చి కుక్క గురించి.
'సార్! ఆ పిచ్చి కుక్కను సాధ్యమైనంత త్వరగా పట్టుకునేట్లు చూడండి' అని మంగళవారం కర్నాటక శాసనమండలిలో జనతా దళ్ (ఎస్) సభ్యుడు కె.టి. శ్రీకాంతెగౌడ మండలి చైర్మన్ వీరన్న మతికట్టిని వేడుకున్నప్పుడు సభ నవ్వులలో మునిగిపోయింది.
గత కొన్ని రోజులుగా ఎల్ హెచ్ లో శాసనసభ్యులు, ఉద్యోగులు, వారి సందర్శకులను ఆ కుక్క విపరీతంగా భయపెడుతున్నది. ఇంతవరకు 17 మందిని అది కరిచిందని శ్రీకాంతెగౌడ తెలిపారు. ఆ ప్రాంగణంలో ఒక మహిళను ఆ కుక్క కరవడం తన కంట పడిందని ఆయన చెప్పారు. బెంగళూరులో వీధి కుక్కల సంఖ్య తగ్గిపోయిందని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బిబిఎంపి), ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అసంబధమైనవని గౌడ పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్య తీసుకోవలసిందిగా అధికారులను కోరాలని మతికట్టి ప్రభుత్వాన్ని ఆదేశించారు.
News Posted: 10 March, 2010
|